“భారీ బడ్జెట్ సినిమా” ఇండియన్ సినిమాను ప్రస్తుతం ఊపేస్తున్న ఒకే ఒక్క మాట. ఈ ఒక్క మాట అడ్డుపెట్టుకుని సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేయడం… సినిమా గురించి ఒక్కో అప్డేట్ ఇస్తూ అభిమానులను పిచ్చోళ్లను చేయడం, సినిమాలో మీరు గతంలో చూడని ఏదో ఉంది… మేం చూపించబోతున్నాం అనే సంకేతాలు ఇవ్వడం, మా సినిమాను కొట్టిన సినిమా ఇక లేదు ఇక రాదు అనే అతి చేష్టలు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు… ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు, పాటల రిలీజ్ ఈవెంట్ లు. గతంలో పాటలు అన్నీ ఒకసారే ఆడియో ఫంక్షన్ చేసి రిలీజ్ చేస్తే ఇప్పుడు ఒక్కో పాటకు ఒక్కో ఈవెంట్.
ఒక్కో పాటకు ఒక్కో రాష్ట్రం. ఇలా ప్రతి ఒక్కటి ఒక పండగలా చేసి ఆ సినిమాపై అభిమానుల్లో ఏదో తెలియని పిచ్చిని లేపడం… ఆ పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి సినిమా రిలీజ్ తర్వాత డ్రామాలు వేయడం… సమాజాన్ని ఎలా దోచుకోవాలో రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు తెలిసినంత బాగా మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల పేరుతో సినిమా వాళ్ళ దోపిడీ అంతా ఇంతా కాదు. ఉదాహరణకు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని తీసుకుందాం. ఆ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఒక కాన్సెప్ట్.
ఆ సినిమా నిర్మాతలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన రానంత లాభం. ఆ సినిమాతో వచ్చేసింది దాదాపు 2000 కోట్ల వరకు ఆ సినిమా బిజినెస్ చేసింది విడుదల తర్వాత. విడుదలకు ముందే దాదాపు 1000 కోట్లు వసూలు చేసింది సినిమా. ప్రతి ఒక్కటి మార్కెటింగ్ చేయడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బులు సంపాదించడంతో నిర్మాతలకు భారీగానే లాభాలు వచ్చాయి. దానికి తోడు మా ఆశకు తృప్తి లేదన్నట్టు మా జేబులకు ఇంకా వందల కోట్లు వేలకోట్లు దోచుకోవడానికి కాళీ ఉంది అనే సంకేతాలు ఇస్తూ ఏకంగా 1300 రూపాయలకు పుష్పా సినిమా టికెట్ విక్రయించారు.
అభిమానుల్లో అలాగే సినిమా ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని… మా సినిమా ఎందుకు చూడరు… సినిమా హాల్ కి ఎందుకు రారు అనే ధీమాతో ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచేశారు. బెనిఫిట్ షోస్ పేరుతో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత షోలు వేసేవాళ్ళు అంతకు ముందు. ప్రీమియర్ షో అనే ఒక ట్యాగ్ తగిలించి… రిలీజ్ కు ముందు రోజు సాయంత్రం నుంచే షోలు వేయడం మొదలుపెట్టారు. ఆ షో కు భారీగా వసూలు చేసి ప్రేక్షకుల నుంచి ఎంతలాగాలో అంత గుంజుకున్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లు కుటుంబాలతో సహా వెళ్లి ప్రాణం కూడా తీసుకున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షో లేదు తొక్క లేదు అనే క్లారిటీ ఇచ్చింది. అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి వస్తే బొక్కలు ఇరుగుతాయి అన్నట్టు మాట్లాడింది. నేను ముఖ్యమంత్రిగా ఉండగా మీ డ్రామాలు ఇక చెల్లవు అంటూ శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సినిమా పరిశ్రమకు చెమటలు పట్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో దోచుకోవడానికి సంక్రాంతి నుంచి సిద్ధమైన సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఒకప్పుడు ప్రజలు వినోదం చూడటానికి పదుల మైళ్ళు నడిచి వెళ్లేవాళ్లు. అలాంటిది ఇప్పుడు థియేటర్లు ఇంటి దగ్గరలో ఉండటం, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఖర్చుపెట్టడానికి వెనకడుగు వేయడం లేదు. కానీ భారీ బడ్జెట్ సినిమాల పేరుతో పెద్ద పెద్ద సినిమాలు విడుదల చేశాం… తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాం… తెలుగు సినిమా స్థాయి పెరిగింది అనే సొల్లు కబుర్లతో ఇప్పుడు భారీగా వసూలు చేయడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా రెడీ అయిన సినిమా పరిశ్రమను రేవంత్ రెడ్డి గల్లా పట్టి బయటకు లాగారు.
సమాజంలో బెనిఫిట్ షోలో పేరుతో దందాలు చేస్తున్న సినిమా పరిశ్రమకు… మీ డ్రామాలు ఇక చెల్లవు అనే క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు కు బెనిఫిట్ షోలు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ పుష్ప సినిమా చేసినంత పెంట గతంలో ఏ సినిమా చేయలేదు. ఒక మహిళ ప్రాణం కూడా తీసింది. మరో చిన్నారి ప్రాణాన్ని గాలిలో పెట్టింది. ఆ ప్రాణం గాల్లో దీపంలా మారింది. రాబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే అనేది టాలీవుడ్ ఆవేదన. దీనితో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు టాలీవుడ్ పెద్దలు.
సాధారణంగా టికెట్ ధరల పెంపు విషయంలో సిగ్గు కాసేపు పక్కనపెట్టి ముఖ్యమంత్రుల ఇళ్ల చుట్టూ లేకపోతే క్యాంపు ఆఫీసుల చుట్టూ తిరిగే సినిమా నిర్మాతలకు… ఇప్పుడు వెళ్లే అవకాశం కూడా లేకుండా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనితో ఆయనపై కంటే అల్లు అర్జున్ పేరు వింటే చాలు మండిపడుతున్నారు టాలీవుడ్ పెద్దలు. మీ సినిమా సంగతి సరే మరి మా సినిమాల సంగతి ఏంటి అంటూ అల్లు అర్జున్ నిలదీయడానికి రెడీ అయ్యారు. సమాజంలో సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సినిమా పరిశ్రమ ఒక దోషిగా మిగిలిపోయింది.
జనాలను సంతోషపెట్టే సినిమాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కలిగింది. తెలంగాణ సమాజంలో సినిమాలకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా అల్లు అర్జున్ కారణంగానే ఆ మహిళ ప్రాణం పోయింది అనేది అందరిలో బలపడింది. దీనితో సినిమా పరిశ్రమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఏ అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. టికెట్ ధరలను పెంచేది లేదని బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ సినిమా వాళ్లు ఆయన వద్దకు వెళ్లారని ధరలు తగ్గిస్తే ఆయన పరువు పోయే అవకాశం కూడా ఉంటుంది.
అందుకే సినిమా టికెట్ ధరల విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గకపోవచ్చు. ఈ విషయం టాలీవుడ్ పెద్దలకు స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ పేరు వింటే చాలు మెగా ఫ్యామిలీ పెద్దలు కూడా సీరియస్ అయిపోతున్నారు. నీ రికార్డులు మేమెలా బ్రేక్ చేసేది అనే కోపమో… మా జేబులకు చిల్లు పెట్టావనో కోపమో సినిమా వాళ్ళ అందరిలో పీకల వరకు ఉంది. కక్కడమే ఆలస్యం. తమ సినిమాలకు నష్టాలు వస్తే బాధ్యత ఎవరిది అంటూ నిలదీయడానికి రెడీ అవుతున్నారు.
అల్లు అర్జున్ కారణంగా నార్త్ ఇండియా లో కూడా తెలుగు సినిమా పరువు పోయింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ ధరల పెంపు విషయంలో కఠినంగానే ఉండే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా టాలీవుడ్ పెద్దలకు కొంప ముంచాడు అల్లు అర్జున్ అనేది ఇప్పుడు అందరిలో బలపడుతున్న భావన. మరి దీనికి అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం వెళ్తుందో ఏ విధమైన క్లారిటీలు సినిమా పెద్దలకు ఇస్తాడో చూడాలి. తన తండ్రికి ఉన్న పరపతితో అల్లు అర్జున్ కేసుల నుంచి బయటపడినా… భవిష్యత్తులో మాత్రం సినిమా పరిశ్రమ కచ్చితంగా దోషిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే చిన్న సినిమాల వాళ్ళు కూడా అల్లు అర్జున్ పేరు వింటే మండిపడుతున్నారు.