Kushi: 3 రోజుల్లో రూ.70 కోట్లు కలెక్ట్ చేసిన ఖుషీ మూవీ 10 రోజుల్లో రూ.100 కోట్లు దాటేస్తుందనుకున్నారు. కానీ.. సినిమా రిలీజై 10 రోజులైనా ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాకపోవడం షాక్ ఇస్తోంది. తేడా ఎక్కడ కొట్టింది..? హిట్ అవుతుందనుకున్న మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. టైటిల్లో వున్న ఖుషీ చిత్ర యూనిట్‌లో కనిపించడం లేదు. అబ్దుల్ వహాద్ ఇచ్చిన ఆడియో సినిమాకు హైప్ తీసుకొచ్చింది. టీజర్, ప్రమోషన్ కిక్ ఎక్కించింది. దీనికి తగ్గట్టే.. మొదటి 3 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్.. రూ.32 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే.. ఇంకో నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే ఏడు రోజుల్లో 5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి షాకిచ్చింది.
సినిమా హిట్ కావాలంటే రూ.52 కోట్లు కలెక్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు రూ.41 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు ఖుషీ ప్లాప్‌కు అన్ని లేకపోయినా నాలుగైదు రీజన్స్ అయితే పక్కాగా కనిపిస్తున్నాయి. హీరో, హీరోయిన్లు ప్రేమలో పడ్డారు.. ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. మనస్పర్ధలతో విడిపోయారన్న పాత కాన్సెప్ట్‌కు కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్ అనే షుగర్ కోటింగ్ అద్దాడు దర్శకుడు శివ నిర్వాణ. కాశ్మీర్ అందాలు బాగున్నా.. కథలో కొత్తదనం లేదన్న రీజన్ డివైడ్ టాక్ తీసుకొచ్చింది. ఖుషీ వసూళ్లకు వానలు కూడా అడ్డుకున్నాయి. సోమవారం.. మంగవారం వానలు నైజాం వసూళ్లకు బ్రేకులేశాయి. ఓవర్సీస్‌లో ముందుగా బ్రేక్ ఈవెన్ కాగా.. ఇంకో మూడ్నాలుగు రోజుల్లో నైజాంలో పెట్టుబడి వచ్చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇంతవరకు బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. చూస్తుంటే ఓవర్సీస్.. తమిళనాడు తప్ప.. మరెక్కడా ఖుషీ సేఫ్ జోన్‌లోకి వచ్చేట్టు కనిపించడం లేదు. దీనికితోడు జవాన్ హైప్ ముందు ఖుషీ తట్టుకోలేకపోయింది.
జవాన్ తుఫాన్‌లో ఖుషీని మర్చిపోయారు ఆడియన్స్. ఖుషీ మ్యూజికల్ ఈవెంట్‌లో విజయ్‌దేవరకొండ, సమంత డ్యాన్స్ పెర్ఫామెన్స్ కిక్ ఎక్కించింది. వీరిద్దరి రొమాంటిక్ డ్యాన్స్ ప్రమోషన్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిందనిపించినా ఈ ఇద్దరి స్టేజ్ కెమిస్ట్రీని యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ యాంగిల్లో వాడుకున్నారు. జవాన్ దెబ్బకు ఖుషీనే కాదు… చిన్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఖంగుతింది. ఓపెనింగ్స్ లేక విలవిలలాడిపోయింది. సెలబ్రిటీస్ ప్రశంసలు కురిపించినా.. బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న అనుమానంలో పడ్డారు మేకర్స్. జవాన్‌ను ఎదర్కొని ఈ చిన్న చిత్రం లాభాలబాట పట్టడం విశేషం.