చేతబడి కాన్సెప్ట్‌తో వచ్చి విరూపాక్ష స్టోరీ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సినిమాలో పశుతత్వ క్షుద్ర ప్రయోగం అనే కాన్సెప్ట్ చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా పశుతత్వ క్షుద్ర ప్రయోగం గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. పశుతత్వ క్షుద్ర ప్రయోగం అంటే ఏంటి… దాన్ని ఎలా ప్రయోగిస్తారు.. మనుషుల మీద ఎలా పని చేస్తుంది.. అసలు నిజంగా అలాంటి ప్రయోగం ఒకటి ఉందా లేదా.. కేవలం సినిమా కోసం క్రియేట్ చేశారా.. అప్పట్లో తులసీదళంలో రాసిన పేర్లలాగా.. ఇదంతా కూడా అంతా గాలి ముచ్చటేనా అని నెటిజన్లు డిస్కషన్ కూడా మొదలుపెట్టేశారు.
రుద్రవనం అనే గ్రామంలో వరుస మరణమాలకు పశుతత్వ ప్రయోగమే కారణమని ఓ అఘోరా చెప్తే.. అసలు ఆ శక్తిని నిర్వీర్యం చేసేందుకు హీరో ఏం చేశాడు. ఊళ్లో 345మంది ప్రాణాలను ఎలా కాపాడాడు అనేదే కథ. పశుతత్వ ప్రయోగం గురించి సినిమాలో ఇచ్చే ఎలివేషన్ అంతా ఇంతా కాదు. భయంతో గూస్‌బంప్స్ వస్తాయ్ కొన్నిచోట్ల ! ఎలాంటి కఠినమైన పరిస్థితుల మధ్య ఈ ప్రయోగాలు చేస్తారో.. కాస్త అటు ఇటు అయితే తిరిగి ఎలా ప్రాణాలు తీస్తుందో కళ్లకు అద్దినట్లు చెప్పారు సినిమాలో ! దీంతో పశుతత్వం అనే పదం.. ఆడియెన్స్ మైండ్‌లో అలా ఉండిపోయింది.
దీంతో అది ఏంటని సెర్చ్ చేసే పనిలో పడ్డారు అంతా ! నిజంగా ఇలాంటి పూజలు ఉంటాయా.. మనుషుల ప్రాణాలు తీసే శక్తి వాటికి ఉందా అంటే.. అంత సీన్ లేదు. నిజానికి సినిమా కోసమే అలాంటి పేరు క్రియేట్ చేశారు తప్ప.. అలాంటి పూజలు లేవు, ప్రయోగాలు లేవు. సినిమాల్లో చూపించడానికి, కథలుగా చెప్పుకోడానికి అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్‌గా ఇవేవీ నిజం అయ్యే చాన్స్ కూడా లేదు. క్షుద్రపూజలు అనేవే నిజానికి ఓ మూఢనమ్మకం. అలాంటిది బాణామతి, చిల్లంగి, చేతబడి అంటూ రకరకాల పేర్లు పెట్టి మరీ భయపడుతుంటారు.. భయపెడుతుంటారు చాలామంది ! విరూపాక్షపై మరికొందరి మాట ఇంకోలా ఉంది. క్షుద్రపూజలు అనేదే చెత్త కాన్సెప్ట్… మళ్లీ దానికి పేర్లు పెట్టి కొత్త కథలు అల్లడం.. అంతా టైమ్ వేస్ట్ యవ్వారం అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు.