Chiranjeevi: అశ్వినిదత్ పబ్లిక్ నోటీసు.. చిరంజీవి గురించేనా..?

తాజాగా వైజయంతి మూవీస్ సంస్థ ఒక పబ్లిక్ లీగల్ నోటీస్ జారీ చేసింది. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రానికి సంబంధించి పూర్తి హక్కులు తమకే ఉన్నాయని తెలిపింది. ఈ చిత్రంలోని పేర్లు, పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు వంటివి ఎవరు వాడుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 02:35 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీదేవి హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రం 1990లో విడుదలై సంచలనం విజయం సాధించింది. ఈ చిత్రం గురించి ఇప్పుడెందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే.. చిత్ర నిర్మాణ సంస్థ జారీ చేసిన పబ్లిక్ లీగల్ నోటీసే కారణం. తాజాగా వైజయంతి మూవీస్ సంస్థ ఒక పబ్లిక్ లీగల్ నోటీస్ జారీ చేసింది. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రానికి సంబంధించి పూర్తి హక్కులు తమకే ఉన్నాయని తెలిపింది. ఈ చిత్రంలోని పేర్లు, పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు వంటివి ఎవరు వాడుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ చిత్రానికి సంబంధించి ప్రీక్వెల్, సీక్వెల్ హక్కులు కూడా తమకే ఉన్నాయని సంస్థ నోటీసులో పేర్కొంది. పూర్తి మేధోపరమైన హక్కులు తమకే ఉన్నాయని వెల్లడించింది. ఎవరైనా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి కంటెంట్ ఉపయోగించినా.. న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఉన్నట్లుండి ఈ హెచ్చరికల్ని వైజయంతి సంస్థ ఇప్పుడు జారీ చేయడం వెనుకగల కారణాలపైనే ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీనికి త్వరలో చిరంజీవి నటించబోయే చిత్రమే కారణమని అనుమానాలు తలెత్తుతున్నాయి. చిరంజీవి త్వరలో బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే, ఈ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఫాంటసీ మూవీ అని.. మనిషికి, దేవ కన్యలకు సంబంధించిన సినిమా అని ప్రచారం జరుగుతోంది. మరో అడుగు ముందుకేసి.. ఇది జగదేక వీరుడు అతిలోక సుందడి సీక్వెల్ అనే అంశం తెరమీదకొచ్చింది.

దీంతో వైజయంతి సంస్థ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తమ చిత్రంలోని పాత్రల్ని, సన్నివేశాల్ని ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని వైజయంతి నోటీసులు జారీ చేసింది. ముందు జాగ్రత్తగా చిరంజీవి అయినా సరే.. తాము నిర్మించిన సినిమా తాలూకు కథని వాడుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ నోటీసు జారీ చేశారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, నిజంగానే చిరంజీవి చేయబోయే చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెలా.. కాదా.. అనే స్పష్టత లేదు. కానీ, చిరంజీవిని కనీసం సంప్రదించకుండా.. ఆయనను లెక్క చేయకుండా ఇలా నోటీసులు జారీ చేయడం సరైందేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా సమస్య ఉంటే.. చర్చించి, పరిష్కరించుకునే అవకాశం ఉంది కదా అని కొందరి అభిప్రాయం. ఈ విషయంలో చిరు అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.