Waheeda Rehman: వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌..!

ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు.. వహీదా రెహమాన్ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది. 5దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను.. ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహమాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు.

  • Written By:
  • Updated On - September 26, 2023 / 02:52 PM IST

Waheeda Rehman: భారతీయ సినిమా రంగంలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు చాలా ప్రతిష్టాత్మకం. ఇండస్ట్రీకి ఎంతో సేవ చేస్తే తప్ప.. ఇలాంటి అవార్డులు వరించవ్. ఈ అవార్డు అందుకుంటే చాలు అంటూ.. సీనియర్ యాక్టర్లంతా కలలు కంటుంటారు. హాలీవుడ్‌కు ఆస్కార్ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఎలాగో.. మనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అలా అన్నమాట. ఈ అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ సెలక్ట్ అయ్యారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు.. వహీదా రెహమాన్ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది.

5దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను.. ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వహీదా రెహమాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగారో పాటకు డాన్స్ చేసింది ఈమే! వహీదాను 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2011లో పద్మభూషణ్‌ అవార్డు అందుకుంది వహీదా రెహమాన్. ఇప్పుడు ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైంది. దాదాపు 90కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది వహీదా రెహమాన్. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ సినిమాల్లో కూడా వహీదా రెహమాన్ నటించింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేసి ఆడియెన్స్ మనసు దోచుకుంది.

బంగారు కలలు సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు చెల్లెలుగా, సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సింహాసనం సినిమాలో రాజమాత రోల్ చేసింది. CID సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వహీదా.. ఆ తర్వాత ప్యాసా, ఏక్ ఫూల్ చార్ కాంటే, కాలా బజార్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. 1974లో పెళ్లి చేసుకున్న వహీదా రెహమాన్.. ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈమె భర్త కమల్జీత్ కూడా నటుడే. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఆయన నాలుగేళ్ల కింద చనిపోయాడు.