వర్షాకాలంలో బురదతో కాస్త చిరాకుగా అనిపిస్తుంది కానీ చినుకు పడితే ప్రకృతి అందం మారిపోతుంది. ఒక్కసారి వర్షం పడితే అడవికి కనిపించే తీరే వేరు. చాలా మంది నేచర్ లవర్స్‌కు వర్షాకాలం కన్నుల పండగే. చాలా మంది నేచర్ అనగానే ఊటీ, కొడైకెనాల్, మనాలి లాంటి ప్రాంతాలను గుర్తు చేసుకుంటారు. కానీ హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న అనంతగిరి హిల్స్.. నేచర్ లవర్స్‌కు మంచి డెస్టినేషన్ స్పాట్. నార్మల్‌గానే ప్యూర్‌గా కనిపించే ఈ ప్రాంతం.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మరింత అందంగా కనిపిస్తోంది. ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది.
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి కొండల్లో వర్షాల కారణంగా జలపాతాలు కళకళలాడుతున్నాయి. పచ్చని చెట్లతో అనంతగిరి అటవీ ప్రాంతం పర్యాటకులను మైమరిపిస్తోంది. ఈ ప్రాంతంలో అడవిని ముద్దాడుతూ వెళుతున్న మేఘాలు టూరిస్టులను కట్టిపడేస్తున్నాయి. అందుకే అనంతగిరిని తెలంగాణ ఊటీ అని పిలుస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. దాదాపు 3 వేల 763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాంతం.. అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా కొండలు, అడవి అందాల మధ్య 1,300 సంవత్సరాల చరిత్ర గల అనంత పద్మ నాభస్వామి ఆలయం ఉంది.
ఈ కొండల పైనుంచి వచ్చే నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్‌కు వెళ్తుంది. మూసీ నదికి అనంతగిరి కొండలే జన్మస్థానం. ఇక్కడి అడవులు తెలంగాణ రాష్ట్రంలోనే దట్టమైనవిగా ప్రసిద్ధి చెందాయి. అనంతగిరి కొండ మాత్రమే కాదు.. వికారాబాద్ నుంచి అనంతగిరికి వెళ్లే రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో ప్రకృతి అలరారుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడే ఉండిపోతామంటారు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరితవనాలు, ఇరుకైన లోయలు, అలరించే నెమళ్లు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు అనంతగిరి ప్రాంతం. అయితే ఈ ప్లేస్‌కు బస్, రైలులో వెళ్లడం కంటే మీ సొంత వాహనాల్లో వెళ్లడం బెటర్. ఎందుకంటే అనంతగిరి కొండలతో పాటు ఆ కొండలను చేరుకునే ప్రాంతం కూడా ప్రకృతిపాన్పులా అందంగా ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి మంచి డెస్టినేషన్స్ కోసం వెతికేవాళ్లకు అనంతగిరి హిల్స్ బెస్ట్ ఆప్షన్.