ఆ 12 గంటలు జైలులో బన్నీ ఏం చేశాడంటే

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లి 9వ చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

  • Written By:
  • Publish Date - December 14, 2024 / 08:05 PM IST

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లి 9వ చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంచేందుకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్‌ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్‌ బెయిల్‌ పత్రాల కోసం రిసెప్షన్‌లో వేచి ఉన్నారు. అయితే, రాత్రి పదిన్నర గంటల వరకు హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్‌ ట్రైల్‌ ఖైదీగా ఖైదీ నంబర్‌ 7697 నెంబర్‌తో మంజీరా బ్యారక్‌లో ఉంచారు. సాధారణంగా సూర్యాస్తమయానికి ఖైదీలను బ్యారక్‌లలోకి పంపుతారు.

అప్పటి వరకు వచ్చే బెయిలు ఆర్డర్లకు సంబంధించిన ఖైదీలను లోపలికి పంపరు. వారందరి బెయిలు పత్రాలను పరిశీలించి, జైలు రికార్డుల్లో ఎంట్రీ చేసి, అందర్నీ ఒకేసారి విడుదల చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత వచ్చే బెయిలు ఆర్డర్లకు సంబంధించి ఖైదీలను అప్పటికే బ్యారక్‌లకు పంపడం వల్ల వారిని విడుదల చేయరు. కానీ, వారికి సంబంధించిన బెయిలు పత్రాలను పరిశీలించి, జైలు రికార్డుల్లో ఎంట్రీ చేస్తారు. సూర్యోదయం కాగానే వారిని విడుదల చేస్తారు. అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టు నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు చంచల్‌గూడ జైలుకు తీసుకువచ్చారు. ఆరు గంటల్లోపే ఆయనకు బెయిలు సమాచారం అందింది. దాంతో ఆయన ఏ క్షణమైనా విడుదల అవుతానన్న భరోసాతో ఉన్నారు. కానీ ఆరు గంటల వరకు బెయిలు కాపీలు రాకపోవడంతో మరి కాసేపు వేచిచూసి ఆయన్ను నిబంధనల ప్రకారం బ్యారక్‌లోకి పంపారు. అప్పుడే ఆయన రాత్రంతా జైల్లో ఉండటం ఖాయమైంది. దాంతో ఆయన మొహంలో అసహనం పెరిగిపోయింది. ఖైదీలందర్నీ బ్యారక్‌లలోకి పంపినట్లుగా ధ్రువీకరించుకున్నాకే చివరగా అల్లు అర్జున్‌ను బ్యారక్‌కు తరలించారు.

తనను ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్‌లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారు. రిసెప్షన్‌ నుంచి అల్లు అర్జున్‌ను బ్యారక్‌కు తరలిస్తున్నపుడు ఇతర బ్యారక్‌లలో ఉన్న ఖైదీలు పుష్ప… పుష్ప… అంటూ అరుస్తూ ఉన్నారట. జైల్లో అర్జున్‌కు భోజనం ఆఫర్‌ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్‌ విధించినపుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే, ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలిరోజు రాత్రి అర్జున్‌ సాధారణ ఖైదీల లాగే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకొని పడుకోవాల్సి ఉంటుంది. పదిన్నర తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిలు ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు. బెయిలు కార్యక్రమం రాత్రే ముగిసిపోయినందున శనివారం తెల్లవారగానే ఏడు గంటల్లోపే అల్లు అర్జున్‌ను విడుదల చేస్తారు. సెలవు రోజైనా విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు కాబట్టి బన్నీ బెయిల్‌ మీద బయటకు వచ్చేశాడు.