సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆరోగ్యంపై ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఆయనకు ఏమైందో అర్ధం కాక ఫ్యాన్స్ పూజలు మొదలుపెట్టారు. దాదాపు పదేళ్ళ నుంచి రజనీ కాంత్ పదే పదే ఆస్పత్రికి వెళ్ళడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి ప్రధాన కారణం కూడా ఆరోగ్యమే అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం రజనీ కాంత్ తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఆయనకు ఆపరేషన్ కూడా వైద్యులు నిర్వహించారని తెలియడం ఫ్యాన్స్ ని కంగారు పెట్టింది.
ఇప్పుడు 73 ఏళ్ల రజనీకాంత్ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ కూడా లైన్ లో ఉంది. ఈ సమయంలో ఆయనకు అనారోగ్యం అనే వార్తలు అటు నిర్మాతలను కూడా భయపెట్టాయి అనే మాట వాస్తవం. ఈ నేపధ్యంలో అసలు ఆయనకు ఏమైంది అనేది అపోలో ఆస్పత్రి ఓ ప్రకటన చేసింది. రజనీ కాంత్… 30 సెప్టెంబర్ 2024న గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని… ఆయన గుండె నుండి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని… దీనికి శస్త్రచికిత్సతో కాకుండా, ట్రాన్స్ కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స చేసామని తెలిపారు.
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృహ దమనిలో స్టెంట్ ను ఏర్పాటు చేసారని, ఆ వాపు పూర్తిగా తగ్గిందని పేర్కొన్నారు. ఎండోవాస్కులర్ రిపేర్ చేసినట్టు అపోలో ప్రకటించింది. ప్రణాళికాబద్ధంగా ఆ ప్రక్రియ సాగిందని శ్రేయోభిలాషులకు, అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆయన ఇంటికి వెళ్లిపోతారని పేర్కొన్నారు. ఇక రజనీ కాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.