ఈ మధ్య బాక్సాఫీస్ షేక్, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు… లాంటి మాటలు పదే పదే వింటున్నాం. మరి అసలు బాక్సాఫీస్ అంటే ఏంటీ…? బాక్సాఫీస్ అనే మాట ఎందుకు వచ్చిందో మీకు తెలుసా…? మనలో చాలా మందికి తెలియదు కదా… అసలు బాక్సాఫీస్ అనేది ఒక మాట కాదు. బాక్స్-ఆఫీస్… రెండు మాటలు. ఇంగ్లిష్ లో కూడా విడదీసే రాస్తారు గాని మన తెలుగులో కలిపి రాస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వసూళ్లు అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా మీకు…?
16వ శతాబ్దంలో యూరప్ దేశాల్లో నాటకాలకు బాగా క్రేజ్ ఉండేది. వీటికి సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు అందరూ వచ్చేవారు. అందులో సామాన్య ప్రజలు కూర్చోవడానికి ముందు… అంటే మన దగ్గర కుర్చీ ఉంటుంది కదా అలా… ఇక ప్రముఖులు కూర్చోవడానికి… వెనుక సీట్లు ఉండేవి. వారి కంటే లగ్జరీ కోరుకునే ప్రజలు కూర్చోవడానికి అట్ట పెట్టెల మాదిరి… ఒక ప్లేస్ ఉంటుంది. దానిని “బాక్స్” అని పిలిచేవారు.
మన సినిమా హాల్ మాదిరిగానే… ఒక్కో ప్లేస్ కి ఒక్కో ధర ఉంటుంది. సాధారణంగా బాక్స్ అనేది ఎక్కువగా నిండేది కాదు. బాక్స్ నిండిపోయింది అంటే ఆ నాటకం సూపర్ డూపర్ హిట్. అప్పట్లో బాక్స్ లో టికెట్ కొనడం అంటే సామాన్యులకు సాధ్యం అయ్యేది కాదు. నిర్మాతలకు బాక్స్ నిండితేనే బాగా డబ్బులు వచ్చేవి. ఇప్పుడు మన టికెట్ కౌంటర్ల మాదిరిగానే అక్కడ ఒక ఆఫీస్ ఉండేది. టికెట్లు అమ్మేవారు ఆ ప్రదేశంలో. అలా నాటకం ప్రదర్శించడం అయిపోయిన తర్వాత ఆఫీసులో ఎన్ని వసూళ్లు వచ్చాయో లెక్కించేవారు. ఆ తర్వాత ప్రత్యేకంగా బాక్స్ కి వచ్చిన డబ్బులను లెక్కించే వారు. అలా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనే మాట వచ్చింది.