Mega Bhajana: భంభోళ భజన! మెగాఫ్యామిలీని భజనగాళ్లే ముంచేస్తున్నారా ?

భజన చేసీ చేసీ.. తప్పులు సలహాలు ఇచ్చి.. ఈ ఇద్దరిని ఫెయిల్యూర్స్‌లోకి నెట్టేస్తోందీ బ్యాచ్. ఆ తర్వాత సైలెంట్ అయిపోతోంది. బ్రో, భోళాశంకర్ విషయంలో జరిగింది అదే !

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 06:07 PM IST

మెచ్చుకోలుకు, పొగడ్తకు వెంట్రుకవాసి తేడా అంతే ! ప్యారాషూట్‌ లేకుండా మనిషిని గాల్లో తేలగలిగేలా చేసేది పొగడ్త. దానికి పడని వాళ్లు ఉండరు. అదే పొగడ్తనే వృత్తిగా మార్చుకొని ఊదరగొట్టడమే భజన. మెగా ఫ్యామిలీ చుట్టూ ఇలాంటి బ్యాచే తయారయింది. ప్రీ రిలీజ్‌లు, సక్సెస్‌ మీట్‌లు, సంబరాలు.. వేదిక ఏదైనా వాయించేస్తున్నారు వీళ్ల భజనతో ! భజనతో ఆపితే బాగానే ఉండేది. దిక్కుమాలిన సలహాలన్నీ ఇస్తున్నారు. దెబ్బడిపోతున్నారు. చిరు, పవన్ విషయంలో మరీ పీక్స్‌. మీరు మనుషులు కాదన్నా.. దైవాశం సంభూతులు అంటూ.. మనుషులకు దూరం చేస్తున్నారు. వాళ్లకి వాళ్లు దేవుళ్లలా ఫీలయ్యే స్థితికి తీసుకువస్తున్నారు. నా సునామీ, నేను దాచుకున్న ఆయుధం అంటాడు ఒకడు.. హైపర్ ఆవేశంతో చిరు పేరు చెప్పి స్టేజీ మీదే చొక్కాలు చింపేసుకుంటాడు మరొకడు. చెప్పాం కదా.. పొగడ్తకు పడనివాడు ఎవడూ ఉండడని ! దేవుళ్లలా ఫీల్ అవుతున్న చిరు, పవన్‌ కూడా మనుషులే కాబట్టి.. వాళ్లు కూడా పడిపోతున్నారు.

పవన్ సంగతి వదిలేస్తే.. చిరు చుట్టూ చేరిన బ్యాచ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్‌ పొగుడుతూనే స్టార్లు అయిపోతున్నారు వాళ్లంతా ! జీకే మోహన్‌, సురేష్‌ కొండేటి, హైపర్‌ ఆదితో పాటు.. జబర్దస్త్‌ యాక్టర్లంతా ఆయన పక్కన చేరి మునగ చెట్టు ఎక్కించి.. దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు. రియాలిటీకి దూరంగా తీసుకెళ్తున్నారు చిరును ! అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లో.. పొగడడం తప్ప తమ దగ్గర మ్యాటర్ లేదు అనుకున్న వాళ్లో ఇలా చేస్తున్నారనుకుంటే ఏదో అనుకోవచ్చు. భజన బ్యాచ్‌లో డైరెక్టర్లు కూడా చేరిపోతున్నారు ఇప్పుడు ! మెహర్ రమేష్‌, బాబీ.. చిరు చుట్టూ చేరి పిసుకుతు ఉన్న డైరెక్టర్స్ బ్యాచ్ కూడా పెద్దదే !

ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి.. పవన్ పక్కన ఎలాగూ గురూజీ ఉండనే ఉన్నాడు. మొదట్లో రెండు మూడు పొగడ్తలే అన్నట్లు కనిపించాడు. ఇప్పుడు భజన స్టార్ట్ చేశాడు. మంచోడు అనడం వేరు.. దేవుడిలా ప్రొజెక్ట్ చేయడం వేరు.. చిన్నప్పుడు చదివి సంస్కృత గ్రంథాల్లో పదాలు వెతుక్కొని.. తన పుస్తక పరిజ్ఞానాన్ని మొత్తం.. పవన్‌ భజనకే యూజ్ చేస్తున్నాడు త్రివిక్రమ్‌. పవన్ మాట్లాడే ప్రతీ మాట వెనక త్రివిక్రమ్‌ వినిపిస్తున్నాడు అంటే.. అర్థం చేసుకోవచ్చు ఎంతలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు అని ! భజన బ్యాచ్‌ ఉంటే పర్లేదేమో.. కానీ అదే బ్యాచ్ వలలో పడి.. ఇంకెవరినీ పక్కకు రాకుండా చేయడమే తప్పు ! మన తప్పులు చూసేవాడు శత్రువు.. మన తప్పులు చెప్పేవాడు స్నేహితుడు.. మన తప్పులకు కూడా ఊదరగొట్టేవాడు భజనబ్యాచ్. ఇది మెగా బ్రదర్స్‌కు ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో మరి!

భజన చేసీ చేసీ.. తప్పులు సలహాలు ఇచ్చి.. ఈ ఇద్దరిని ఫెయిల్యూర్స్‌లోకి నెట్టేస్తోందీ బ్యాచ్. ఆ తర్వాత సైలెంట్ అయిపోతోంది. బ్రో, భోళాశంకర్ విషయంలో జరిగింది అదే ! ఈ రెండు సినిమాలు నాశనం అవడం వెనక భజన బ్యాచే కారణం. ఒక్కటి మాత్రం నిజం. ప్రేమ అయినా పొగడ్త అయినా.. గుండెల్లోంచి రావాలి.. బాధ్యతగా కాదు. పొగడడం బాధ్యత అనుకొని భజన చేసే బ్యాచ్‌ల విషయంలో మెగా బ్రదర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే !