“3 నెలల్లో సినిమా తీసి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టగలడు” ఇది పూరీ జగన్నాథ్‌కు టాలీవుడ్‌లో ఉన్న రెపుటేషన్. బద్రి, ఇడియట్, పోకిరీ, గోలీమార్ ఇలా చెప్పుకుంటూ పోతే పూరీ జగన్నాథ్ బ్లాక్‌బస్టర్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. కథ, కథనం విషయం పక్కన పెడితే.. కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమా తీయగల సత్తా ఉన్న అతి తక్కువ మంది డైరెక్టర్స్‌లో పూరీ జగన్నాథ్ ప్రముఖుడు. అయితే చాలా రోజుల నుంచి ఈ డైరెక్టర్ ఎక్కడా కనిపించడంలేదు. కనీసం పోడ్‌కాస్ట్‌లో వినిపించడంలేదు. ఏ ఈవెంట్‌కు రావడంలేదు. లైమ్‌లైట్‌కు లాంగ్ డిస్టెన్స్ పాటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌ను వదిలేసి ముంబైలోనే ఉన్నట్టు చాలా కాలంగా టాక్ నడుస్తోంది. అయితే పూరీ అజ్ఞాతవాసానికి కారణం ఏంటి. లైగర్ కొట్టిన దెబ్బేనా ? ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అంచనాలను తలకిందులు చేసింది. సినిమా ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయ్యిందంటే.. మూవీ కొన్న డిస్ట్రబ్యూటర్స్ తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ పూరీ జగన్నాథ్ ఇంటికి కూడా వచ్చారు. లీగల్ యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎలాగోలా ఆ ఇష్యూ సర్దుమనిగినా.. పూరీ మాత్రం చాలా డీప్‌గా హర్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన పెద్దగా బయటికి రావడంలేదు. అత్యంత సన్నిహితులతో చిన్న చిన్న పార్టీస్‌కు వెళ్లడం తప్పితే.. సినీ ప్రపంచానికి చాలా దూరంగా ఉంటున్నాడు. సినీ జీవితంలో హిట్స్ ఫ్లాప్స్ కామన్. ఒక డైరెక్టర్‌గా ఈ విషయం పూరీకి తెలిసిందే. కానీ లైగర్ ఫ్లాప్ కారణంగా ఇంత డిస్టెన్స్ మెయిన్‌టేన్ చేయాలా ? ఓ పక్క విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు. లైగర్ సినిమా ఓ పీడకళ అనుకుని మర్చిపోయాడు. కానీ పూరీ మాత్రం ఇంకా అదే ఫోబియాలో ఉన్నాడా ? గాడ్ ఫాదర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశాడు పూరీ జగన్నాథ్. కానీ అప్పటి నుంచి దీనిపై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. లైగర్ డిజాస్టర్ కారణంగా ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్-2 ప్లాన్ చేశాడు పూరీ చాలా కాలంగా దీని గురించి ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. ఈ సినిమా కూడా సెట్స్ వరకూ వెళ్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్. అయితే ఒక్క ఫ్లాప్‌తో ఇంతలా మారిపోతాడా అనేది ఆయన అభిమానుల్లో ఉన్న అనుమానం. ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమాతో హిట్ కొట్టాలి కానీ ప్రపంచానికి కనిపించకుండా ఎందుకు ఉంటున్నారనేది వాళ్లలో ఉన్న ప్రశ్న. అయితే పూరీ అజ్ఞాతవాసానికి అసలు రీజన్ ఏంటో ఆయనే చెప్పాలి మరి.