సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన అక్కినేని కుటుంబం ఒంటరి అయిపోయిందా…? అక్కినేని నాగార్జునకు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడానికి కారణం ఏంటీ…? మెగా ఫ్యామిలీకి నాగార్జునకు దూరం ఎందుకు పెరిగింది…? దగ్గుబాటి కుటుంబంతో కూడా నాగార్జునకు సఖ్యత లేదా…? ఇప్పుడు ఈ ప్రశ్నలు సినీ, పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో అత్యంత బలమైన కుటుంబంగా ఒక వెలుగు వెలిగిన అక్కినేని కుటుంబం ఇప్పుడు కనీస మద్దతు రాక ఒంటరిగా మిగిలిపోయింది.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది అక్షరాలా నిజం. సినిమా పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి మంచి పేరుంది. వారి ఆధ్వర్యంలో నడిచే అన్నపూర్ణ స్టూడియోస్ లో కొన్ని వందల సినిమాలు షూటింగ్ లు జరిగాయి, ఇంకా జరుగుతాయి. ఇక అక్కినేని నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ సైతం అందరికి తెలిసిందే. ఇదంతా ఒక వైపు… కాని ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంతో నాగార్జున ఇమేజ్ డ్యామేజ్ అయింది. సగటు సినీ ప్రేక్షకుడే కాదు, తెలుగు అర్ధమైన ప్రతీ ఒక్కరు, ఆ వార్త తెలుసుకున్న అందరూ నాగార్జునదే తప్పు అంటూ వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది.
ఆక్రమించి కట్టలేదని నాగార్జున ఎంత మొత్తుకున్నా సరే ఉపయోగం లేదు. ఎందుకంటే… ఒక ప్రైవేట్ ఆస్తి జోలికి ప్రభుత్వం వెళ్ళే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది. చెరువుని కబ్జా చేసి నిర్మాణం చేపట్టారనే విషయం ఆ ఫోటోలు చూస్తే అర్ధమవుతుందని సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ వచ్చాయి. అక్కినేని నాగార్జున లాంటి పలుకుబడి ఉన్న వ్యక్తి జోలికి, మీడియా హైలెట్ చేసే ఒక ప్రముఖ స్థలం జోలికి వెళ్ళాలంటే ఒకటికి వంద సార్లు అధికారులు ఆలోచిస్తారు. న్యాయపరమైన చిక్కులను అధికారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నాగార్జున ఆక్రమించలేదు అని చెప్తే సరిపోదు, అన్ని లెక్కలు చూసుకున్న తర్వాతనే అధికారులు రంగంలోకి దిగారు కూల్చేశారు. అదంతా ఒక ఎత్తు… ఆ తర్వాత కోర్ట్ కి వెళ్తే కోర్ట్ యేవో ఉత్తర్వులు ఇచ్చింది, అప్పటికే పని పూర్తయిపోయింది. ఇక నాగార్జున మీడియా ముందుకు రాకుండా ఎక్స్ లో పోస్ట్ చేసారు. నిజంగా తన తప్పు లేకుంటే… ఆ భూమికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు ఉంచి, తన వాదన ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పే అవకాశం నాగార్జునకు ఉంది. కాని ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.
ఇక్కడ కీలక విషయం ఏంటీ అంటే… కన్వెన్షన్ సెంటర్ ను కూల్చిన తర్వాత సినిమా పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా నాగార్జునకు మద్దతుగా ట్వీట్ చేయడం గాని, వీడియో రిలీజ్ చేయడం గాని, కనీసం ఆయనతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించడం గాని ఏ ఒక్కటి చేయలేదు. మెగా ఫ్యామిలీతో నాగార్జున సన్నిహితంగానే ఉంటారు. వారిలో ఏ ఒక్కరు కూడా నాగార్జునతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అప్పట్లో ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున… సినిమా టికెట్ల ధరలను తగ్గించినా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేసారు. అందరూ మాట్లాడినా ఆయన మాట్లాడలేదు. ఇక అప్పటి నుంచి నాగార్జునకు సినిమా పరిశ్రమ దూరం జరిగింది. ఇక నందమూరి బాలకృష్ణ… నాగార్జునపై ముందు నుంచి కాస్త అసహనంగానే ఉంటారు. అప్పట్లో భూములు పంచుకుంటున్నారు అనే కామెంట్స్ కూడా చేసారు ఆయన. మరోవైపు సోషల్ మీడియాలో ఏ ఒక్క నటుడు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. నిజంగా న్యాయం ఆయన వైపు ఉంటే… ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తే… ఏ రూపంలో అయినా మద్దతు వచ్చి ఉండేది. కాని అదేం జరగలేదు.
అంత పలుకుబడి ఉన్న నాగార్జున సినిమా వాళ్లకు దూరం కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆయనకు సినిమాల కంటే వ్యాపారం కీలకం. ఈ విషయం ఎన్నో సార్లు రుజువు అయింది. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ జగన్ కంపెనీల్లో భాగస్వామి అయ్యారు. పరోక్షంగా రాజకీయాల్లో ఆయన ఉంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ఆయనకు పెద్ద సమస్య అయింది. సినిమా పరిశ్రమ ఏపీలో ఇబ్బంది పడే సమయంలో అండగా నిలవాల్సింది పోయి, జగన్ తో చర్చించే అవకాశం ఉన్నా మాట్లాడాల్సింది పోయి డ్రామాలు ఆడారు అనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి… ఎన్ కన్వెన్షన్ విషయంలో సీరియస్ గా ఉండటానికి రాజకీయ కారణం కూడా అయి ఉండవచ్చు. రాజకీయ నాయకులు కూడా నాగార్జున తీరుని తప్పుబట్టారు. సిపిఐ, బిజెపి పార్టీలు ఆయనను దుయ్యబట్టాయి. ఇదంతా స్వయంకృతాపరాధం అనేది స్పష్టంగా చెప్పవచ్చు. సినిమా పరిశ్రమకు అండగా నిలవాల్సిన టైం లో ఆయన నిలబడి ఉంటే… ఇప్పుడు వాళ్ళు నిలబడి ఉండేవాళ్ళు. తన సినిమాలకు ధరలతో సంబంధం లేదని ఏదేదో మాట్లాడి… కుటుంబం లాంటి సినిమా పరిశ్రమను ఆయన దూరం చేసుకున్న మాట వాస్తవం. ఇప్పుడు ఇదే నాగార్జునను ఒంటరి చేసింది.