Sonam Kapoor: బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం జరగబోతుంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల6న లండన్‌లో ఘనంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో పాల్గొనే అతిథులకు ఆహ్వానాలు పంపుతోంది బ్రిటన్. ఆహ్వానాలు అందుకున్న వారిలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా ఉన్నారు. అయితే, ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడానికి కారణం ఏంటి? ఈ వేడుకల్లో ఆమె ఎందుకు పాల్గొంటున్నారు?
బ్రిటన్‌లో ఒకవైపు ప్రజాస్వామ్య పాలన ఉన్నా.. మరోవైపు రాచరిక సంప్రదాయం కూడా కొనసాగుతోంది. గత ఏడాది బ్రిటన్ రాణి మరణించిన తర్వాత.. కొత్త రాజుగా కింగ్ చార్లెస్ 3 ఎంపిక కానున్నారు. ఆయన పట్టాభిషేక మహోత్సవం సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరగబోతుంది. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాధినేతలకు, ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఆమె సినిమాలు చేయడం లేదు. ఇక ఇతర ఈవెంట్స్, షోలలో కూడా కనిపించడం లేదు. అలాంటిది ఆమెకు ఎలా ఆహ్వానం అందిందా అని సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. అయితే, సోనమ్ కూర్‌కు ఆహ్వానం రావడం వెనుక కారణం ఉంది.
అసలు కారణం ఇదే!
ప్రస్తుతం సోనమ్ కపూర్ ఈ వేడుకలు జరిగే లండన్‌లోనే ఉంది. కొంతకాలంగా తన భర్త ఆనంద్ అహూజాతో కలిసి అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు రాయల్ ఫ్యామిలీ నుంచి ఆహ్వానం అందింది. ఈవెంట్‌లో ఆమె అతిథిలా కాకుండా, ప్రత్యేకంగా ఒక పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వేడుకలో ఏదైనా ప్రదర్శన ఇస్తుందా..? లేక కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుందా? అనే అంశంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ, సోనమ్ కపూర్ ఈ వేడుకల్లో పాల్గొనడం, ప్రదర్శన ఇవ్వబోతుండటం మాత్రం ఖాయం. దీనిపై సోనమ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. రాజవంశానికి చెందిన వేడుకల్లో పాల్గొనబోతుండటం గర్వంగా ఉందని ఆమె చెప్పింది. కొంతకాలంగా సోనమ్ సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి
కింగ్ చార్లెస్ 3, ఆయన సతీమణి కెమిలియా పట్టాభిషేక వేడుకలకు హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. టామ్ క్రూజ్, క్యాటీ పెర్రీ, లియోనెల్ రిచీ, ఆండ్రియా బొకెల్లి వంటి గ్లోబల్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖులు కూడా ప్రదర్శన ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సోనమ్ ఇవ్వనున్న మొదటి రాయల్ ప్రదర్శన కావడం విశేషం. ఘనంగా జరగనున్న ఈ వేడుకలకు వివిధ దేశాల నుంచి భారీ స్థాయిలో అతిథులు హాజరవుతారు. లక్షల మంది సమక్షంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఇండియా నుంచి ఇంకెంతమంది ప్రముఖులకు ఆహ్వానం అందిందో చూడాలి.