అల్లు అర్జున్ .. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ స్టార్ ! “పుష్ప” మూవీతో దేశమంతటికీ ఆయన స్టార్ డమ్ వ్యాపించింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బన్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాలిటిక్స్ గురించి అల్లు అర్జున్ ఏదైనా మాట్లాడితే.. జనంలోకి కచ్చితంగా మెరుపు వేగంతో వెళ్ళిపోతుంది. ఈ క్రేజ్ ను వాడుకునే ప్లాన్ లో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారని తెలుస్తోంది. ఆయనెవరో ఊహించారా ? ఆ వివరాలను తెలుసుకునే ముందు మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. గతంలో అల్లు అర్జున్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న దాఖలాలను గుర్తుకు తెచ్చుకోవాలి.
నాన్న కోసం ఆనాడు అనకాపల్లిలో..
2009 సంవత్సరంలో తన మేనమామ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కోసం ఒకటి, రెండు నియోజకవర్గాల్లో అల్లు అర్జున్ ప్రచారం చేశారు. ఆ ఏడాది తన తండ్రి అల్లు అరవింద్ (చిరంజీవి బావమరిది) పోటీ చేసిన అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈక్రమంలో తన జన్మదిన వేడుకలను కూడా ఆనాడు అనకాపల్లిలోనే జరుపుకున్నారు. జన్మదిన వేడుకల అనంతరం రోడ్ షోలు నిర్వహించారు. తన తండ్రి అల్లు అరవింద్ కు ప్రత్యర్థుల(సబ్బం హరి, నూకారపు సూర్యప్రకాశరావు) నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడంతో బన్నీ రంగంలోకి దిగారు. ప్రచార ర్యాలీలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి పాల్గొనడంతో జనం పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాతి నుంచి మరెప్పుడూ పాలిటిక్స్ వైపు బన్నీ చూడనేలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా.. పాలిటిక్స్ పై అల్లు అర్జున్ నోరు విప్పి మాట్లాడలేదు.
చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వచ్చేనా ?
ఆనాడు తన మేనమామ చిరంజీవి కోసం ఎన్నికల ప్రచారం చేసిన అల్లు అర్జున్ .. ఇప్పుడు తనకు పిల్లనిచ్చి (స్నేహారెడ్డి) పెళ్లి చేసిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం మరోసారి ప్రచారం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త, బీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డితో అల్లు అర్జున్ పెళ్లి జరిగి పదేళ్లకుపైనే అవుతోంది. స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటున్నారట. ఈ ప్రయత్నాల్లో భాగంగా కంచర్ల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే భగత్‌ను కాదని కంచర్లకు బీఆర్ఎస్ టికెట్ వస్తుందా అని పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వస్తే.. ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై అల్లు అర్జున్ అభిప్రాయం ఏమిటనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కాగా, పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అల్లు అర్జున్ ప్రచారం చేసినా.. చివరి నిమిషంలో టికెట్ రావడం, చంద్రశేఖర్‌రెడ్డి నాన్ లోకల్ కావడంతో ఫలితం దక్కలేదు.