సినిమాలకు పవన్‌ గుడ్‌బై! ఆ మాటకు అర్థం అదేనా..?

  • Written By:
  • Publish Date - August 24, 2024 / 08:27 PM IST

హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేటుతో ఏపీ రాజకీయాల్లో దుమ్ము దులిపిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ప్రధాన మంత్రిత్వ శాఖలు తన దగ్గరే ఉంచుకొని.. పాలనలో తన మార్క్ చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీక్షలు, సమావేశాలతో.. క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. పొత్తులు ఏర్పడడంతో.. కూటమిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ మీద… మరింత బాధ్యత పెరిగినట్లు అయింది. జనాల్లో ఓ వర్గం మార్పు కోసం ఆయన వైపు ఆశగా చూస్తుందన్న విషయం పవన్‌కు కూడా తెలుసు. దీంతో పాలన మీదే ఫోకస్ పెడుతున్నారు. దీనికోసం సినిమాలను కూడా పక్కనపెట్టబోతున్నారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మూవీస్‌కు ఇక గుడ్‌బై చెప్పడం ఖాయమని.. ఆయన మాటలతో అర్థం అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌తో పాటు.. హరిహర వీరమల్లు మూవీస్‌కు పవన్‌ కమిట్ అయ్యారు. ప్రొడ్యూసర్లకు కాల్షీట్లు ఇచ్చాడు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లు సాగుతూనే ఉన్నాయ్. ఐతే ఈ మూడు సినిమాల తర్వాత.. పవన్ మూవీస్‌కు బైబై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామసభలో పవన్ పాల్గొన్నారు. ఓజీ, ఓజీ అంటూ అక్కడ ఫ్యాన్స్‌ నినాదాలు చేశారు. దీనిపై రియాక్ట్ అయిన పవన్.. తనకు సినిమాల కంటే.. సమాజం, దేశమే ముఖ్యం అన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని చెప్పుకొచ్చారు. దీంతో ఇక పవన్‌ సినిమాలకు దూరం కాబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయ్. నిజానికి ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి.. సినిమాలకు పవన్ సరిగ్గా సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతల పరిస్థితి.. గందరగోళంగా మారింది. తీసుకొచ్చిన మొత్తానికి భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ఐతే అన్నీ తెలిసే పవన్‌తో సినిమా కమిట్‌ అయ్యామని.. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సినిమాను పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్తున్నా.. వాళ్లు పడే ఇబ్బందులు కూడా పవన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి.. ఆ తర్వాత గ్యాప్ ఇవ్వడమో, ఫుల్‌స్టాప్ పెట్టడమో బెటర్ అనే ఆలోచనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పైగా ఐదు మంత్రిత్వ శాఖలు. వీటన్నింటికి సమయం కేటాయించడం ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సినిమాలకు దూరం ఉండాలని డిసైడ్ అయితే… ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి..