WHO : No physical activity : బ్రో… అంత బద్దకమా…! ఒళ్ళు వంచండి !!

భారత్ జనాభాలో దాదాపు సగం మంది యువకులు ఒళ్ళు వంచడం లేదని ఓ స్డడీలో తేలింది. శరీరానికి కావల్సినంత శ్రమ చేయడం లేదని అంటోంది ఆ అధ్యయనం.

 

 

భారత్ జనాభాలో దాదాపు సగం మంది యువకులు ఒళ్ళు వంచడం లేదని ఓ స్డడీలో తేలింది. శరీరానికి కావల్సినంత శ్రమ చేయడం లేదని అంటోంది ఆ అధ్యయనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు చెందిన అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఓ స్టడీను నిర్వహించారు. ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో ఈ స్టడీ పబ్లిష్ అయింది. మహిళల్లో 57శాతం మంది కనీసం శ్రమ కూడా చేయట్లేదు. పురుషుల్లో ఇది 42 శాతంగా ఉంది. అంటే వ్యాయామం చేయడానికి మహిళలే ఎక్కువ మంది బద్దకిస్తున్నారు. దక్షిణాసియాలోని ప్రతి దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్టు స్టడీ అభిప్రాయపడింది. 2000 సంవత్సరంలో భారత్ లో తగినంత శారీరక శ్రమ లేని భారతీయులు 22.3శాతం ఉన్నారు. 2022 నాటికి 49.4 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 195 దేశాల్లో ఈ స్టడీ చేయగా… వాటిల్లో భారతో 12 వ స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 31శాతం మంది వయోజనులు వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ, కఠిన వ్యాయామాలు లేదా 75 నిమిషాల కఠిన – అతి కఠిన వ్యాయామాలు కూడా చేయట్లేదు. 2010 లో ఇలాంటి వాళ్ళు 26.4 శాతం మంది ఉంటే అది ఇప్పుడు 31శాతానికి చేరింది. ఇలాగే కంటిన్యూ అయితే 2030 నాటికి కనీస శారీరక శ్రమ చేయని వారి సంఖ్య 60శాతానికి చేరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల డయాబెటీస్, గుండెపోటు లాంటి ముప్పులు తప్పదు. వ్యాయామం చేసేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుండటంతో ఈ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
ఆరోగ్యంగా ఉండాలంటే WHO ఏం చెబుతోంది ?

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత శారీరక శ్రమ అవసరమో World Health Organisation గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం పెద్దవాళ్ళయితే వారానికి 150-300 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం, డ్యాన్స్ చేయడం, నడక, జాగింగ్, ఈత కొట్టడం లాంటి ఏరోబిక్ ఎక్సర్ సైజెస్ మథ్యస్థంగా చేయాలి. లేదా 75 నిమిషాల పాటు తీవ్రత ఎక్కువ ఉండేలా శారీరక శ్రమ చేయాలి. వారానికి 150 నిమిషాల కంటే తక్కువ శారీరక శ్రమ చేసేవాళ్ళు లేదా 75 నిమిషాల కంటే తక్కువ చేసేవాళ్ళు అంతగా చురుకుగా లేనివారిగా గుర్తిస్తారు. వీళ్ళకి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, డెమెన్షియా, బ్రెస్ట్, కొలన్ క్యాన్సర్ లాంటి జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.