Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని దెబ్బతీసే సివిల్ కేసులో ట్రంప్‌కి న్యూయార్క్ జడ్జి భారీ జరిమానా విధించారు. తన ఆస్తుల విలువను మోసపూరితంగా పెంచినందుకు 354.9 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.2,9000 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ జడ్జి శుక్రవారం ఈ తీర్పును వెలువరిచారు.
GSLV-F14: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగం విజయవంతం..
మూడు నెలల విచారణ తర్వాత జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ తన తీర్పును వెల్లడించారు. అలాగే న్యూయార్క్ కార్పొరేషన్‌కు ఆఫీసర్‌గా కానీ, డైరెక్టర్‌గా కానీ మూడేళ్లపాటు ఉండకూడదని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. మూడేళ్ల పాటు ట్రంప్ మళ్లీ బ్యాంకుల నుంచి రుణం తీసుకోకూడదని కూడా ఆదేశించారు. అయితే, ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష విధించలేదని న్యాయమూర్తి తెలిపారు. ఈ సంవత్సరం అధ్యక్ష పదవిని తిరిగి పొందేందుకు పోటీపడుతున్న ట్రంప్‌కి ఇది భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. ట్రంప్.. తన ఆస్తుల విషయంలో అబద్దాలు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ పిటిషన్ వేశారు. దీనిపై దాదాపు మూడు నెలలపాటు కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో దాదాపుగా 40 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తాజాగా తీర్పు వెల్లడించింది కోర్టు.
ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ తరఫు న్యాయవాది అలీనా హబ్బా తెలిపారు. కాగా, ట్రంప్ ఇప్పటికే అనేక అంశాల్లో పలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్ రాష్ట్రం, అమెరికాలోని న్యాయవ్యవస్థ మొత్తం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తనను పోటీ నుంచి తప్పించడానికే ఇలా చేస్తున్నారని, ఈ నిర్ణయం అంతా మోసపూరితమైనదని వ్యాఖ్యానించారు.