2024లోనూ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. టెక్ తో పాటు వివిధ కంపెనీల్లో గత రెండేళ్ళుగా కొనసాగుతున్న ఉద్యోగాల తొలగింపులు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రో సాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలతో పాటు స్విగ్గీ (Swiggy), ఫ్లిప్ కార్ట్ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈకామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ (The platform is Flipkart) లో దాదాపు 11 వందల మందిని తీసేస్తున్నారు. ప్రతి ఏటా పనితీరు ఆధారంగా కొందరిని తప్పిస్తామనీ… ఇప్పుడు కూడా అంతే అంటున్నారు ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు. ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ గా తీసుకున్న నిర్ణయమనీ… ఖర్చులు తగ్గించుకోడానికి మాత్రం కాదన్నారు. కానీ ఫ్లిప్ కార్ట్ నుంచి సీనియర్లు ఒక్కొక్కరుగా రిజైన్ చేస్తుండటంతో ఆ సంస్థ చెబుతున్న దానిపై నమ్మకం కుదరడం లేదనేది బిజినెస్ ఎక్స్ పర్ట్స్ వాదన.
మైక్రోసాఫ్ట్ (Microsoft) లో 19 వందల ఉద్యోగాలు కోత పడింది. గేమింగ్ విభాగాలు యాక్టివిజన్ బ్లిజార్డ్, ఎక్స్ బాక్స్, జెనిమాక్స్ ల్లో ఉద్యోగాలను తొలగిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో కూడా ఉద్యోగాల తొలగింపు మొదలైంది. దాదాపు 400 మందిని తప్పించడానికి ప్రపోజల్స్ రెడీ చేసింది. ఈ కంపెనీ కూడా ఖర్చులు తగ్గించుకోడానికి కాదని వాదిస్తోంది. సంస్థ నిర్వహణ సామర్థ్యాలను పెంచడానికి అని స్విగ్గీ అంటోంది. కానీ 2023 జనవరిలోనూ స్విగ్గీ 380 మందిని తొలగించింది. దీని ప్రభావం కాల్ సెంటర్, కార్పొరేట్ టీమ్స్ పై అధికంగా ఉంటుందని అంటున్నారు. ఈ-బే కూడా వెయ్యి మందిని తొలగిస్తోంది. తమ వ్యాపారం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని అంటోంది. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈబే 500 మంది ఉద్యోగులను తప్పించింది. ప్రస్తుతం లేఆఫ్స్ సంగతి బయటకి రాకుండా ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తోంది ఈబే సంస్థ.
2023లో ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కలసి… దాదాపు 2 లక్షల 40 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇది 50శాతం ఎక్కువ. కరోనా తర్వాత బిజినెస్ మందగించడం, అమెరికా సహా యూరప్ దేశాల్లో ద్రవ్యోల్భణ పరిస్థితులే ఇందుక్కారణం. గూగుల్, మైక్రో సాఫ్ట్, మెటా లాంటి పెద్ద కంపెనీల్లో కూడా… కొలువులకు గ్యారంటీ లేకుండా పోతోంది. స్టార్టప్స్ కూడా ఎడా పెడా ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈపరిస్థితుల్లో 2024లో కూడా లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే స్కిల్స్ పెంచుకోవడం, కొత్త సాఫ్ట్ వేర్స్ పై దృష్టి పెట్టడం లాంటివి చేయాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. ఐటీ పీపుల్ అయితే ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం బెటర్ అని చెబుతున్నారు.