Nepal KP Sharma : నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ నేడు ప్రమాణ స్వీకారం..

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలిని నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు.

నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలిని నియమించినట్లు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. నేపాల్‌-యునైటెడ్‌ మార్క్సి స్ట్‌ లెనినిస్ట్‌ (సీపీఎన్‌-యూఎంఎల్‌), నేపాల్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా ఓలిని అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ ఆదివారం నియమించారు. పార్లమెంటులో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఓలి, అతని మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాగా ఓలి గతంలో 2015-16, 2018-2021 కాలంలో ప్రధానిగా పనిచేయగా, ఇప్పుడు మూడోసారి అధికారం చేపట్టనున్నారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. శుక్రవారం జరిగిన ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్‌ దహల్‌ ప్రచండ ఓడిపోవడంతో ఓలి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో 77 సీట్లున్న కేపీ శర్మ(CPN-UML), 88 సీట్లున్న బహదూర్(NC) కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తొలి 18 నెలలు ఓలి, ఆ తర్వాత బహదూర్‌గా ప్రధానిగా కొనసాగుతారు.