Indian Cricket : దాదా దెబ్బకు ఫ్లింటాఫ్ అబ్బా.. అద్భుత విజయానికి 22 ఏళ్ళు

భారత క్రికెట్ లో 2002 ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ఫైనల్ అభిమానులు ఎవ్వరూ మరిచిపోలేరు.

భారత క్రికెట్ లో 2002 ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ఫైనల్ అభిమానులు ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గంతులేయడం ఎప్పుడు చూసినా ఒక కిక్ ఇస్తుంది. భారత గడ్డపై ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన ఓవరాక్షన్ కు దాదా ఇలా రివేంజ్ తీర్చుకున్నాడు. అసలు ఈ మ్యాచ్ ఎప్పటికీ క్రికెట్ ప్రేమికులకు గుర్తుండిపోతుంది. ఫైనల్‌లో ఇంగ్లండ్ అయిదు వికెట్లకు 325 పరుగులు చేసింది. భారీ స్కోరు సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమని అంతా అనుకున్నారు. భారత్ అద్భుతంగా పోరాడింది. గంగూలీ, సెహ్వాగ్ మంచి ఆరంభాన్నివ్వడంతో మెరుగైన స్థితిలో కనిపించినా అనూహ్యంగా 5 వికెట్లు కోల్పోయింది.

క్రీజులో యువ క్రికెటర్లు మహ్మద్ కైఫ్ , యువరాజ్ మాత్రమే ఉండడంతో ఓటమి లాంఛనమే అనుకున్నారు. అయితే వీరిద్దరూ సంచలన ఇన్నింగ్స్‌లు ఆడారు. యువీ ఔటైనా టెయిలెండర్లతో కలిసి ఆఖరి ఓవర్‌లో కైఫ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. విజయానంతరం గంగూలీ బాల్కానీలోకి వచ్చి చొక్కా విప్పి సెలబ్రేషన్స్ చేశాడు. ఫ్లింటాఫ్‌‌కు నోరు మూయించేలా దాదా సంబరాలు చేశాడు. ఈ ప్రత్యేకమైన క్షణాలకు నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో భారత్ క్రికెట్ ఫ్యాన్స్ వాటిని గుర్తు చేసుకుంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.