Pervez Musharraf: మరణం తర్వాత మరణశిక్ష.. ముషారఫ్‌ శిక్షను సమర్ధించిన కోర్టు

పాక్ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇప్పుడు అభిప్రాయపడింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో.. అప్పట్లో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్‌కు మరణశిక్షను ఖరారు చేసింది.

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 04:22 PM IST

Pervez Musharraf: నేనంతే.. కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ మళ్లీ చంపేస్తా.. ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. అచ్చం అలాంటిదే కాకపోయినా.. అలానే అనిపిస్తోంది ఈ తీర్పు. పాక్ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు 2019లో విధించిన మరణదండన సరైనదే అని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇప్పుడు అభిప్రాయపడింది. అత్యంత తీవ్రస్థాయి దేశద్రోహ కేసులో.. అప్పట్లో ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్‌కు మరణశిక్షను ఖరారు చేసింది.

GUNTUR KAARAM REVIEW: ‘గుంటూరు కారం’ ఎలా ఉంది..? ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. ఐతే శిక్ష ఖరారు దశలో సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్.. కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి, గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు. సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారం చేజిక్కించుకున్న ముషారఫ్.. దాదాపు పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఆ సమయంలో రెండుసార్లు అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలుపుతూ.. ఆయనపై 2008లో అధికారానికి దూరమైన తర్వాత దేశద్రోహ కేసు దాఖలు అయింది. సుదీర్ఘ కాలం పాటు దీనిపై కోర్టులో విచారణ జరిగింది. 2019లో స్పెషల్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. అయితే ముషారఫ్ దుబాయ్ నుంచే దీనిపై న్యాయ పోరాటం చేశారు.

తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేశారు. లాహోర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించగా.. ఈసారి పిటిషన్ దారులు, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఐతే విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ముషారఫ్ పట్టించుకోలేదు. దీంతో ఈ కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ముషారఫ్‌కు విధించిన మరణ శిక్షను సమర్థించడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని కోర్టు వివరించింది. దీంతో మరణించిన వ్యక్తికి మరణశిక్ష ఖరారు అయింది.