టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి. తాజాగా ఆసీస్ కు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. తక్కువ స్కోరును కూడా కాపాడుకుని ఒక్కసారిగా సెమీస్ రేసును రసవత్తరంగా మార్చేసింది. ప్రస్తుతం సూపర్ 8 గ్రూప్ 1లో భారత్ రెండు విజయాలతో టాప్ ప్లేస్ లో ఉంది. టీమిండియా దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నట్టే. 4 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ తో అందరికంటే సేఫ్ పొజిషన్ లో ఉంది. చివరి మ్యాచ్ లో ఆసీస్ పై గెలిస్తే 6 పాయింట్లతో టాప్ ప్లేస్ తోనే సెమీస్ కు చేరుతుంది.
అయితే ఆసీస్ పై విజయంతో సెమీస్ రేసులోకి ఆఫ్ఘనిస్థాన్ దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ రెండేసి పాయింట్లతో ఉండగా… రన్ రేట్ పరంగా కంగారూలు మెరుగైన స్థితిలో ఉన్నారు. భారత్ తో మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఒకవేళ మూడు జట్లూ నాలుగేసి పాయింట్లు సాధిస్తే రన్ రేట్ సెమీస్ బెర్తులు డిసైడ్ చేస్తుంది. అటు బంగ్లాదేశ్ కూడా సెమీస్ రేసులో ఉన్నా కొన్ని అద్భుతాలు జరగాల్సి ఉంటుంది.
చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్ ను బంగ్లాదేశ్ భారీ తేడాతో ఓడించాలి. అలాగే భారత్, ఆసీస్ ను భారీ తేడాతో ఓడిస్తే అప్పుడు మూడు జట్లు రెండేసి పాయింట్లతో ఉంటాయి. భారీ తేడాతో గెలవడం ద్వారా బంగ్లాదేశ్ రన్ రేట్ మెరుగుపరుచుకుంటే ఆ జట్టుకు అవకాశముంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లా కంటే ఆసీస్, ఆప్ఘనిస్థాన్ జట్లు సెమీస్ రేసులో ముందున్నాయి. ముఖ్యంగా భారత్ తో మ్యాచ్ ఆసీస్ కు కీలకం కానుంది.