ఓ ప్రమాదానికి ఎరవేసి వేటాడడం అంటే.. భయం కూడా భయపడి పారిపోవాలి. అప్పుడే ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ధైర్యానికి ఓపిక తోడవ్వాలని.. కలిసి వచ్చే ఒక్క క్షణం కోసం ఎదురుచూడాలి. ఈ మాటలన్నీ ఎందుకు అంటే.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ (Ismail) హనియే విషయంలో ఇదే ఫాలో అయింది ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్. మూడు గదుల్లో బాంబులు (Bombs) .. రెండు నెలల ఉత్కంఠ.. ఒక్క క్షణం కోసం ఎదురుచూపు.. ఎట్టకేలకు హమయేను ఖతమ్ చేసింది. క్షిపణి దాడి (Missile attack) అని ప్రపంచం అనుమానపడేలా.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యపడేలా.. మొసాద్ ప్లాన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది.
హనియే బస చేస్తారని భావించిన ఇంట్లో… రెండు నెలల ముందే బాంబు అమర్చి ఉంచింది మొసాద్. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ.. అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మరణం.. రాగానే ఒక్కసారి మింగేసింది. హనియే హత్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ (Pezheshkian) ప్రమాణస్వీకారానికి వచ్చిన ఆయనను… రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో హత్య చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్ పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌజ్‌లో హనియే హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి ఇజ్రాయిల్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఐతే ఇరాన్, హమాస్, హిజ్బుల్లాలు ఈ దాడి ఇజ్రాయిల్ మొసాద్ చేసిందని ఆరోపిస్తోంది.
దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. హనియేని ఎలిమినేట్ చేయాలని కొన్నేళ్ల నుంచి ఇజ్రాయిల్ గూఢఛార సంస్థ మొసాద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇద్దరు ఇరాన్ ఏజెంట్లను మొసాద్ నియమించుకున్నట్లు సమాచారం. ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలకు వచ్చిన సందర్భంలోనే హనియేని హత్య చేయాలని ముందు ప్లాన్ చేశారు. రద్దీ ఎక్కువ ఉండటంతో ఆ ప్లాన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆపరేషన్‌ని కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకార సమయానికి మార్చారు. ఉత్తర టెహ్రాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ ఆధీనంలో ఉన్న గెస్ట్ హౌజులోనే హనియే ఉంటాడని.. ఏజెంట్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మూడు గదుల్లో బాంబులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధికారుల దగ్గర ఉన్న నిఘా ఫుటేజీలో, ఏజెంట్లు మూమెంట్స్ రికార్డ్ అయ్యాయ్.
ఇద్దరు రూముల్లోకి ప్రవేశించడం.. మూడు నిమిషాల గ్యాప్‌లో వెళ్లిపోవడం చూపించింది. హనియే ఉంటాడని అంచనా వేసిన రూముల్లో పరికరాలను ఉంచి… వారు గుర్తించబడకుండా ఏజెంట్లు బయటకు వెళ్లారు. ఎప్పటికప్పుడు ఆ గదుల మీద నిఘా ఉంచారు. హనియే ఇలా ఎంటరయ్యాడో లేదో.. అప్పటికే అమర్చి ఉన్న బాంబ్‌ను అలా పేల్చేశారు. ఐతే ఇది క్షిపణి దాడి అని ముందు అంతా అనుకున్నారు. కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌పై.. దూరం నుంచి అంత ఆక్యురేట్‌గా క్షిపణి దాడి సాధ్యమేనా.. పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. ఐతే ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే దెబ్బతిన్నాయ్. హనియే మరణానికి.. గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు.
ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తేల్చారు. హనియే మరణం తర్వాత మొసాద్ గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఆ నిఘా సంస్థ గురించి తెలుసుకొని ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. 3 బిలియన్ల వార్షిక బడ్జెట్‌తో.. 7వేల మంది సిబ్బందితో ప్రపంచంలో అమెరికా సీఐఏ తర్వాత రెండో అతిపెద్ద గూఢచార ఏజెన్సీగా మొసాద్ ఉంది. మొసాద్ అనేక విభాగాలను కలిగి ఉంది. ఇది పాలస్తీనా మిలిటెంట్ గ్రూపుల్లోనే కాకుండా లెబనాన్, సిరియా, ఇరాన్ వంటి దేశాల్లో ఇన్‌ఫార్మర్లను, ఏజెంట్ నెట్వర్క్‌ని కలిగి ఉంది. మెట్సాడా అని కూడా పిలువబడే స్పెషల్ ఆపరేషన్ విభాగం, అత్యంత సున్నితమైన హత్యలు, విధ్వంసం వంటి యుద్ధకార్యక్రమాలను నిర్వహిస్తుంది.