ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మరో ఆరో రోజుల్లో ఒలింపిక్స్ 2024కు తెరలేవనుంది. పారిస్ వేదికగా ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధమైంది. 180కి పైగా దేశాల అథ్లెట్లు పాల్గొనబోతున్న ఈ విశ్వ క్రీడలను విజయవంతం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. టెర్రరిస్టుల నుంచి పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో భద్రతను సైతం పటిష్టం చేసింది. నిత్యం 30 వేలకు పైగా పోలీసులను భద్రత కోసం వినియోగించుకోనుంది. ఇక్కడ హైలెట్ ఏంటి అంటే.. ఇండియా నుంచి 10 స్నిఫర్ డాగ్స్ ఈ సెక్యూరిటీలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. మూడోసారి ఒలింపిక్స్‌కు అతిథ్యం ఇస్తున్న పారిస్ ఈ క్రీడలను ఘనంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది.
ఈ క్రీడా సంబురాల్లో పాల్గొనేందుకు 180కి పైగా దేశాల నుంచి అథ్లెట్లు పారిస్కు రానున్నారు. వివిధ దేశాల సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ప్రత్యక్షంగా క్రీడలు వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భద్రత విషయంలో సాయం చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. కే-9 జాతికి చెందిన 10 స్నిఫర్ డాగ్‌లను పారిస్‌కు పంపింది. పారిస్‌కు పంపకముందే భారత్‌లోని కే-9 జాతికి చెందిన 10 డాగ్స్‌కు 10 వారాల పాటు బెంగళూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో మొత్తం 6 బెల్జియన్ షెపర్డ్‌లు, 3 జర్మన్ షెపర్డ్‌లు, 1 లాబ్రడార్ రిట్రీవర్ జాతి డాగ్స్ ఉన్నాయి. ఒలింపిక్స్ నిర్వహించే సమయంలో ఇవి పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటాయి. రోజుకు 30 వేల మంది పోలీసులతో పారిస్‌లో భద్రత కల్పిస్తున్నారు.
సీన్ నదిలో జరిగే ప్రారంభ వేడుకల కోసం 45 వేల మందితో భద్రత కల్పిస్తున్నారు. రోజూ కనీసం 30 వేలకు తగ్గకుండా భద్రత సిబ్బంది పహారా కాయనున్నారు. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ సారి భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. వారితో పాటు 140 మంది సహాయ సిబ్బంది కూడా పారిస్ వెళ్తున్నారు. భారత అథ్లెట్లలో 70 మంది పురుషులు, 47 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అథ్లెటిక్స్‌లో 29 మంది క్రీడాకారులు ఒలింపిక్స్ 2024కు ఎంపికయ్యారు. ఆ తర్వాత షూటింగ్‌లో 21 మంది భారత ఆటగాళ్లు విశ్వ క్రీడలకు అర్హత సాధించారు. అంతే కాకుండా ఇప్పుడు ఆ విశ్వ క్రీడలకు మన డాగ్స్ సెక్యూరిటీగా ఉండటం ఇప్పుడు మనోళ్లలో మరింత జోష్ నింపుతోంది.