అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో నాలుగు వర్షం కారణంగా రద్దయితే… ఇంగ్లాండ్, నమీబియా మ్యాచ్ 10 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. ఇప్పుడు లీగ్ స్టేజ్ ముగియగా.. సూపర్ 8 మ్యాచ్ లు, సెమీఫైనల్స్, ఫైనల్స్ అన్నీ కరేబియన్ దీవుల్లోనే జరగనున్నాయి. దీంతో పూర్తిస్థాయి వినోదాన్ని ఆశిద్దామనుకుంటున్న ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది.
సూపర్ 8 మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా భారత్ ఆడే మూడు మ్యాచ్ లకూ వరుణుడు అంతరాయం కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. సూపర్ 8లో భారత్ మొదట ఆఫ్ఘనిస్తాన్, తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. వీటిలో భారత్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న బార్బడోస్ లో మ్యాచ్ జరిగే రోజు 10 శాతం వర్షం కురిసే అవకాశముంది. అలాగే బంగ్లాదేశ్ తో భారత్ సూపర్ 8 మ్యాచ్ కు వేదికగా ఉన్న ఆంటిగ్వాలో 20 శాతం వర్షం పడే అవకాశముంది. ఇక జూన్ 24న సెయింట్ లూసియా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు 50 శాతం వర్షం ముప్పు పొంచి ఉంది.