అమెరికా అద్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైపోయింది. ప్రపంచాన్ని శాసించే పెద్దన్నను పాలించబోయేదెవరో మరికొన్ని గంటలు లేదా రోజుల్లో తేలనుంది. చిన్న చిన్న దేశాల్లో కూడా ఎన్నికల కౌంటింగ్ గంటల వ్యవధిలో తేలిపోతుంటే అమెరికాలో ఎందుకు రోజులు పడుతుంది…? పాపులర్ ఓట్ సాధించగానే అధ్యక్షుడైపోతారా…? అసలు అధ్యక్షుడెవరన్నది తేలేది ఎప్పుడు…? అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎందుుకు అంత సంక్లిష్టం…?
అమెరికా….ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం… ప్రపంచాన్ని శాసించే శక్తి… అక్కడ ఎన్నికలంటే అందుకే అందరికీ అంత ఆసక్తి. ఆ దేశాన్ని నడిపించడమే కాదు ప్రపంచ గతిని మార్చగల శక్తి అగ్రరాజ్య అధ్యక్షుడికి ఉంటుంది. అందుకే ప్రపంచమంతా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడై కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం వెనుక పెద్ద తతంగమే ఉంటుంది…చివరి వరకూ ఎన్నో ట్విస్టులుంటాయి. ఎక్కువ ఓట్లు వస్తే అధ్యక్షులైపోరు… గెలిచినా పీఠంపై కూర్చునే వరకు గ్యారెంటీ ఉండదు. అదే అమెరికా స్పెషాలిటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎంత సంక్షిష్టమో ఈ పాయింట్లు చెప్పకనే చెబుతున్నాయి. మిగిలిన ప్రజాస్వామ్య దేశాలకు భిన్నం అమెరికా ఎన్నికల ప్రక్రియ. పాపులర్ ఓట్ ప్రకారమే అధ్యక్ష ఎన్నిక జరగదు. ఎక్కువ ఓట్లు వచ్చినా అధ్యక్షుడిగా గెలవరు. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ గంపగుత్తగా వారి ఖాతాలోకే వెళ్లిపోతాయి. అంటే ఎక్కువ ఓట్లు సాధించామా లేదా అన్నది కాదు పెద్ద రాష్ట్రాలను గెలుచుకున్నామా లేదా అన్నది ముఖ్యం. ఇక ఇక్కడ మరో సంక్లిష్ట అంశం చెరో 269 ఓట్లు వస్తే ఏంటన్నది. అదే జరిగితే ప్రతినిధుల సభ అధ్యక్షుడ్ని, సెనెట్ ఉపాధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. జనవరిలోపు ఆ ప్రక్రియ పూర్తి కాకపోతే స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడు అయిపోవచ్చు. హమ్మయ్య చచ్చీచెడీ 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాం అని సంబర పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మనలాగానే అక్కడ ఎలక్టోరల్ ఓటర్లు ఒకరిద్దరు హ్యాండ్ ఇచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. గతంలో కూడా అలా జరిగింది. కాబట్టి ఒకరిద్దరు జంపైపోయినా నో ప్రాబ్లమ్ అనుకోవాలంటే నాలుగు సీట్లు ఎక్కువ గెలవాల్సిందే.
ఫలితాల వెల్లడి కూడా అంత ఈజీ కాదు… ఎందుకంటే ఇప్పుడు ఓటేసిన వారితో పాటు చాలామంది పోస్ట్ ద్వారా ఓటేస్తారు. అవి లక్షల్లో ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు నవంబర్25వరకు పోస్టల్ బ్యాలెట్లను అనుమతిస్తాయి. వాటిని కూడా లెక్కించాలి. అందుకు చాలా సమయం పడుతుంది. అంటే ముందుగా వెల్లడయ్యేది ప్రాథమిక ఫలితాలే. ఆ తర్వాత అవి మారిపోవచ్చు. అదే అధ్యక్ష అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా ఉంటే ఈ పోస్టల్ ఓట్లే ఫలితాలను మార్చేయవచ్చు. 2020 ఎన్నికల్లో అరిజోనాలో బైడెన్ కు, ట్రంప్ కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.3శాతమే. జార్జియాలో అయితే 0.2శాతం. ఇక విస్కాన్సిన్ లో 0.7శాతం. ఈ తేడానే అమెరికా అధ్యక్ష పీఠానికి ట్రంప్ ను దూరం చేసింది. ఈసారీ అలాగే జరిగితే ఆ వచ్చే పోస్టల్ ఓట్లు ఫలితాలను తారుమారు చేయవచ్చు. కాబట్టి అభ్యర్థి ఆ రాష్ట్రంలో పోలైన ఓట్లలో కనీసం 50శాతం కన్నా ఓట్లను సాధిస్తే ఇబ్బంది ఉండదు. అదే చెరో 49శాతం ఓట్లు సాధిస్తే ఆ ఒకటీ అరా శాతమే ఫలితాలు తారుమారు చేస్తుంది. పోయినసారి జార్జియా విషయంలో ఇలాంటి గందరగోళమే జరిగింది. ఫలితాల వెల్లడికి నాలుగు రోజులు పట్టింది. 2000సంవత్సరంలో అయితే న్యాయవివాదం కారణంగా కౌంటింగ్ కే నెలరోజులు పట్టింది. లెక్కింపు ప్రక్రియ అంత సంక్లిష్టంగా ఉంటుంది. ఒక్కోసారి పోస్టల్ శాఖ ఆలస్యంతో బ్యాలెట్లు సరైన సమయానికి చేరకోకపోతే దానిపై కోర్టులకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ అంత గందరగోళంగా ఉంటుంది.
270 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లు వచ్చినా గెలిచినట్లు కాదు. ఆ ఎలక్టోరల్ ఓటర్లు డిసెంబర్ 11న సమావేశమై తమ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు ఓటేస్తారు. సాధారణంగా ఓ రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓటన్నీ ఒకరికే దక్కుతాయనుకున్నాం. కానీ ఒక్కోసారి ఒకరిద్దరు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంది, దానిపై కూడా న్యాయ వివాదం నడుస్తోంది. ఇలా ఎలక్టర్లు వేసిన ఓట్లు డిసెంబర్ 17నాటికి వాషింగ్టన్ చేరాలి. జనవరి6న అమెరికన్ కాంగ్రెస్ ఈ ఓట్లను లెక్కబెడుతుంది. అధికారికంగా అధ్యక్షుడ్ని ప్రకటిస్తుంది. అంటే అప్పటివరకు గెలిచిన అభ్యర్థికి టెన్షన్ తప్పదు. ఓడిన అభ్యర్థికి అవకాశాలు పూర్తిగా మూసుకుపోవు. అందుకే కనీసం 3వందల ఎలక్టోరల్ ఓట్లైనా నెగ్గాలని అభ్యర్థులు భావిస్తుంటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నిక పూర్తిగా బ్యాలెట్ ద్వారానే జరుగుతుంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశమే అయినా అమెరికా ఈవీఎంలు వాడదు. అక్కడి ఓటర్లు అందుకు వ్యతిరేకం. సంప్రదాయ విధానాన్ని మార్చడానికి వాళ్లు ఒప్పుకోరు. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘంగా సాగుతుంది. సంక్లిష్టంగాను ఉంటుంది. అందుకే పూర్తి ఫలితాల కోసం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే….