అమెరికా ఎన్నికలు ఎందుకింత క్లిష్టం ? పాపులర్‌, ఎలక్టోరల్‌ ఓట్ల మధ్య తేడా ఇదే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు ట్రంప్‌ విజయం సాధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో విజేత ఎవరు అని ఊహించడం విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది.

  • Written By:
  • Publish Date - November 6, 2024 / 07:04 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎట్టకేలకు ట్రంప్‌ విజయం సాధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో విజేత ఎవరు అని ఊహించడం విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది. ఎన్నికల ఫలితాలు కూడా అదే రేంజ్‌లో సస్పెన్స్‌ను కొనసాగించాయి. చివరి నిమిషం వరకూ ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. ఇక కామన్‌ పీపుల్‌కు ఐతే అర్థం కూడా కాలేదు. అమెరికా ఎన్నికల ప్రాసెస్‌ చాలా క్లిష్టంగా ఉంటుంది కాబట్టే కామన్‌ పీపుల్‌లో ఇంత సస్పెన్స్‌ నెలకొంది. నిజానికి ఈ సస్పెన్స్‌ ప్రతీసారీ ఓటింగ్‌లో కనిపిస్తుంది. ప్రజలు మొత్తం ఒకరికి ఓటు వేస్తే ప్రెసిడెంట్‌ మాత్రం ఇంకొకరు అవుతారు. 2016లో ఇదే సీన్‌ కనిపించింది. దీనికి కారణం పాపులర్‌, ఎలక్టోరల్‌ ఓట్ల మధ్యలో ఉన్న తేడా. అమెరికాలో ఎలక్షన్‌ ప్రాసెస్‌ చాలా క్లిష్టంగా ఉంటుంది.

యూఎస్‌లో ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్స్‌ పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. నవంబర్ 5న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నా, ఎలక్టోరల్ కాలేజీకి చెందిన 538 మంది ఓటర్లు అమెరికా అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. ప్రతీ రాష్ట్రానికి ఓ కాంగ్రెస్‌ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉండే సెనెటర్లు, రిప్రజెంటేటివ్స్‌ను కలిపి కాంగ్రెస్‌ అంటారు. రాష్ట్రంలో ఉండే జనాభాను బట్టి వీళ్లు ఎంత మంది ఉంటారు అనేది డిసైడ్‌ చేస్తారు. వీళ్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే అమెరికా అధ్యక్షులు అవుతారు. వీళ్లే వేసే ఓట్‌నే ఎలక్టోరల్‌ ఓట్‌ అంటారు. ప్రస్తుతం అమెరికాలో 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఓట్లకు లేదం అంతకు మించి ఎవరు గెలుచుకుంటారో వాళ్లే అమెరికా ప్రెసిడెంట్‌. అమెరికాలో మొత్తంగా కాంగ్రెస్‌లో 100 మంది సెనేటర్లు, 435 మంది ప్రతినిధులు ఉన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ D.C.కి సెనేటర్లు, ప్రతినిధులు లేనప్పటికీ ముగ్గురు ఓటర్లు ఉన్నారు.

యూఎస్‌ రాజ్యాంగం ప్రకారం, నిర్దిష్ట వ్యక్తులు ఓటర్లుగా ఉండకూడదు. అంటే సెనేటర్లు, ప్రతినిధులు లేదా ప్రభుత్వ హోదాలో ఉన్న ఎవరినైనా ఓటు హక్కు పొందరు. అమెరికన్లు జనరల్‌ ఎలక్షన్స్‌లో నేరుగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌కు ఓటు వేయరు. ఎలెక్టర్లుగా పేర్కొనే వ్యక్తులకు ఓటు వేస్తారు. ప్రతి ప్రెసిడెన్షియల్ అభ్యర్ధికి ఎలెక్టర్ల గ్రూపు వీళ్లను స్లేట్‌ అంటారు. 48 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీలో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి ఆ రాష్ట్ర ఎన్నికల ఓట్లన్నీ గెలుస్తారు. దీన్ని ‘విన్నర్‌-టేక్‌-ఆల్’ సిస్టమ్ అంటారు. మైనే, నెబ్రాస్కా రాష్ట్రాల్లో మాత్రం రూల్స్ వేర్వేరుగా ఉన్నాయి. ఎందుకంటే అవి తమ ఎలక్టోరల్‌ ఓట్లను విభజించాయి. జిల్లా స్థాయి, రాష్ట్రవ్యాప్త ఫలితాల ఆధారంగా ఎలక్టోరల్‌ ఓట్లు కేటాయిస్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే, అభ్యర్థికి మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో కనీసం 270 అవసరం. ఒకవేల ఏ అభ్యర్థి కూడా ఈ మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోతే, ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. నిజానికి ఇక్కడ కామన్‌ పీపుల్‌ వేసే ఓట్లు ప్రెసిడెంట్‌ను డిసైడ్‌ చేయవు. వాళ్లు వేసే ఓట్‌ను పాపులర్‌ ఓట్‌ అంటారు. పాపులర్‌ ఓట్లు ఎక్కవగా వచ్చి ఎలక్టోరల్‌ ఓట్లు తక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి ఓడిపోయిట్టే. 2016లో ఇదే జరిగింది. హిల్లరీ క్లింటన్‌కు పాపులర్‌ ఓట్లు ట్రంప్‌ కంటే ఎక్కువగా వచ్చినా.. ట్రంప్‌కు ఎలక్టోరల్‌ ఓట్లు ఎక్కువగా రావడంతో ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం అటు పాపులర్‌ ఓట్లు, ఇటు ఎలక్టోరల్‌ ఓట్లు రెండింటి మెజార్టీ సాధించి విజయకేతన ఎగరవేశారు ట్రంప్‌.