క్రికెట్ బర్త్ కంట్రీ ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకుంది. టెస్ట్ క్రికెట్ లో 5 లక్షలకు పైగా పరుగులు సాధించిన దేశంగా చరిత్రకెక్కింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఈ ఘనత అందుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని సాధించిన తొలి క్రికెట్ జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్ జట్టుకు ఇది 1,082వ టెస్టు. ఇక 4,28,868 పరుగులతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. 2,78,751 టెస్ట్ పరుగులు సాధించిన భారత్ భారీ వ్యత్యాసంతో ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ టాప్ లో ఉండడానికి చాలా కారణాలున్నాయి. మిగిలిన క్రికెట్ దేశాలతో పోలిస్తే టెస్ట్ ఫార్మాట్ కు ఇంగ్లీష్ టీమ్ అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. తమ కౌంటీ క్రికెట్ లోనూ రెడ్ బాల్ ఫార్మాట్ కే ప్రయారిటీ ఇస్తూ ఆటగాళ్ళను తయారు చేస్తుంది. ఆ దేశ క్రికెటర్లు కూడా టెస్టులే ఎక్కువ ఆడుతూ భారీస్కోర్లు అందిస్తుంటారు.
అటు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇప్పటి వరకు 929 సెంచరీలు సాధించారు. ఆ తరువాత ఆస్ట్రేలియా అత్యధికంగా 592 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా.. భారత బ్యాటర్లు 552 శతకాలు బాదారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండోరోజే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లీష్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 378/5 పరుగులతో ఉంది. దీంతో ఆధిక్యం 533 పరుగులకు చేరిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 125 రన్స్‌కే కుప్పకూలిపోగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసి.. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్న వేళ సిరీస్ ను కైవసం చేసుకోవడం లాంఛనమే.