కొత్త అవతారం ఎత్తిన కరోనా.. 27దేశాల్లో అల్లకల్లోలం.. ప్రమాదంలో భారత్‌!

కరోనా మిగిల్చిన భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కేసుల సంఖ్య తగ్గుతోందని సంతోషపడే లోపే.. పిడుగు లాంటి వార్త బయటికి వచ్చింది.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 07:40 PM IST

కరోనా మిగిల్చిన భయాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కేసుల సంఖ్య తగ్గుతోందని సంతోషపడే లోపే.. పిడుగు లాంటి వార్త బయటికి వచ్చింది. కోవిడ్‌ వైరస్ అంతం అవుతుంది అనుకున్న ప్రతీసారి.. కొత్త రకం వేరియంట్లు విస్తరిస్తూనే ఉన్నాయ్. అయితే అందులో చాలా వేరియంట్లు ప్రాణాలకు ముప్పు తీసుకురానప్పటికీ.. రోజుకో వేరియంట్ పుట్టుకు రావడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. XEC అనే కొత్త కరోనా వేరియంట్ కారణంగా 27 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన శాస్త్రవేత్తలు.. ఈ XEC వేరియంట్ సోకినవారి నమూనాలు తీసుకుని టెస్టులు చేస్తున్నారు. ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జనాలకు హెచ్చరికలు చేస్తున్నారు.

అయితే ఈ XEC కొవిడ్ వేరియంట్ అత్యంత ప్రమాద‌క‌ర‌మైందని సైంటిస్టులు చెప్తున్నారు. దీని వ్యాప్తి చాలా వేగంగా ఉందని అంటున్నారు. XEC వైరస్‌ను మొట్టమొదటగా జర్మనీలో గుర్తించగా.. ప్రస్తుతం యూరోప్‌లోని చాలా దేశాల్లో మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. జర్మనీ త‌ర్వాత ఈ XEC వేరియంట్ కేసులు బ్రిట‌న్‌, అమెరికా, డెన్మార్క్‌తో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగు చూశాయి. ఒమిక్రాన్ వేరియంట్‌కు స‌బ్‌ లీనియేజ్‌గా ఉన్న ఈ కొత్త వేరియంట్‌లో రకరకాల మ్యుటేష‌న్లు జ‌రుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గ‌తంలో ప్రపంచ దేశాలను వణికించిన ఒమిక్రాన్ స‌బ్‌ వేరియంట్లు అయిన KS 1.1, KP 3.3 త‌ర‌హాలోనే ఈ కొత్త ఎక్స్ఈసీ కేసులు కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 27 దేశాల నుంచి 5వందల నమూనాలను సేకరించి వాటిని ప‌రీక్షిస్తున్నారు. పోలాండ్‌, నార్వే, లక్సెంబ‌ర్గ్‌, ఉక్రెయిన్, పోర్చుగ‌ల్‌, చైనా లాంటి దేశాల్లో ఇప్పటివరకు ఈ XEC కరోనా కేసులు న‌మోదయ్యాయి.