డబుల్ సెంచరీపై బుమ్రా కన్ను, మెల్ బోర్న్ లో ఖాయమే

ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా దుమ్మురేపుతున్నాడు. మిగిలిన బౌలర్ల నుంచి సపోర్ట్ లేకున్నా తాను మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ ఆసీస్ కు కంగారు పుట్టిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - December 26, 2024 / 12:57 PM IST

ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా దుమ్మురేపుతున్నాడు. మిగిలిన బౌలర్ల నుంచి సపోర్ట్ లేకున్నా తాను మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ ఆసీస్ కు కంగారు పుట్టిస్తున్నాడు. అతన్ని ఎదుర్కోలేక ఆసీస్ బ్యాటర్లు తల పట్టుకుంటున్నారు. మంచి ఫామ్ లో ఉన్న బుమ్రా నాలుగో టెస్టులోనూ భారత్ కు కీలకం కానున్నాడు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టుకు ముందు అరుదైన రికార్డు అతన్ని ఊరిస్తోంది. బుమ్రా మరో 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఓవరాల్‍గా 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకున్న అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‍కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్‌ల్లో 194 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‍గా టెస్టు క్రికెట్‍లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన జాబితాలో పాకిస్థాన్ బౌలర్ యాసిర్ షా టాప్‍లో ఉన్నాడు. అతను 33 టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టాడు. మెల్‍బోర్న్ టెస్టులో 200 వికెట్ల మైలురాయి చేరితే బుమ్రా ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంటాడు. ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు ఈ ఫీట్ సాధించడం చాలా ఈజీనే అని చెప్పాలి. పైగా మెల్ బోర్న్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని తేలిపోయిన నేపథ్యంలో అతన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.