ఒకేరోజు 17 వికెట్లు, పెర్త్ లో బ్యాటర్లకు ఎర్త్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్టులో తొలిరోజు బౌలర్ల హవా నడిచింది. అది కూడా పేస్ బౌలర్లు నిప్పుల చెరిగారు. బౌన్సీ పిచ్ పై అటు ఆసీస్, ఇటు భారత పేసర్లు పండగ చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 08:00 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్టులో తొలిరోజు బౌలర్ల హవా నడిచింది. అది కూడా పేస్ బౌలర్లు నిప్పుల చెరిగారు. బౌన్సీ పిచ్ పై అటు ఆసీస్, ఇటు భారత పేసర్లు పండగ చేసుకున్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్టార్క్‌, కమ్మిన్స్‌, మార్ష్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భార‌త ఫాస్ట్ బౌల‌ర్లు కూడా ఆస్ట్రేలియాకు ధీటుగా బ‌దులిచ్చారు. కెప్టెన్ జ‌స్ప్రీత్ బుమ్రా మ‌రోసారి మ్యాజిక్ చేశాడు. అత‌డిని ఎదుర్కొవ‌డం ఆసీస్ బ్యాట‌ర్ల త‌రం కాలేదు. 4 వికెట్లు ప‌డ‌గొట్టి ఆసీస్‌ను బుమ్రా దెబ్బ తీశాడు. ఓవ‌రాల్‌గా తొలి రోజు ఆట‌లో మొత్తం 17 వికెట్ల‌ను ఇరు జట్ల బౌల‌ర్లు నేల‌కూల్చారు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఒక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు ప‌డ‌డం 1952 త‌ర్వాత‌ ఇదే మొద‌టిసారి. ఈ ‍మ్యాచ్‌తో 72 ఏళ్ల రికార్డు బ్రేక్‌ అయ్యింది.