ఆర్టిస్టులను అవమానిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని డెడ్‌లైన్ ఇచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు.. వెకిలి రాతలు రాసే చానెళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఖతమ్ అంటూ ఎండ్ కార్డు పెట్టేస్తున్నాడు. ఈ మధ్యే ఐదు యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేయించిన విష్ణు.. ఇప్పుడు ఏకంగా 18 చానెల్స్ క్లోజ్ చేయించాడు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కళాకారులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు.. యూట్యూబ్ ఛానెల్‌లను రద్దు చేయడానికి మా కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా… హానికరమైన కంటెంట్‌ని వ్యాప్తి చేసే అదనపు 18 ఛానెల్‌లను బ్లాక్ చేశామని.. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి అంటూ రాసుకొచ్చారు విష్ణు. మా తరపున, అన్ని యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ట్రోలర్‌లను గమనించామమని.. పరువు నష్టం కలిగించే ట్రోల్ వీడియోలను సైబర్ క్రైమ్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని.. దయచేసి ఛానెల్‌లు, ప్రొఫైల్‌ల నుంచి అలాంటి కంటెంట్ తీసివేయండి అంటూ మిగతా చానల్లకు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ రెండు పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. చానెల్ బ్యాన్ చేయించడానికి ముందు.. వారం రోజుల టైమ్ ఇస్తున్నారు.. ఆలోపు అలాంటి కంటెంట్ డిలీట్ చేశారా సరే.. లేదంటే ఏకంగా బ్యాన్ చేయిస్తున్నారు. చూస్తునే ఉండండి అని మరో పోస్ట్ పెట్టారంటే.. క్లోజ్ చేయించబోయే యూట్యూబ్ చానెల్స్ లిస్ట్ భారీగానే ఉండి ఉంటుందనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. యూట్యూబ్‌లో చెత్త రాతలు రాసే చానెళ్లపై… ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తోంది. ప్రణీత్ హనుమంతు ఘటన తర్వాత.. ఇలాంటి విషయాల్లో సర్కార్ కూడా సీరియస్‌గా ఉంటుంది. ఇదే ఆయుధంగా చేసుకొని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా.. అలాంటి చెత్తను ఏరివేసేందుకు రెడీ అవుతోంది. మొన్న 5.. ఇవాళ 18.. రేపు ఎన్ని చానెల్స్ బ్యాన్ అవుతాయో అంటూ చర్చ మొదలైంది.