తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 247 మండలాల్లో వడగాలులు వీస్తాయని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు రోజురోజూ పెరుగుతోంది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు.
వడదెబ్బకు ఒక్కరోజే 19 మంది మృతి
రాష్ట్రాంలో ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో వడదెబ్బతో ఏకంగా 19 మంది చనిపోయారు. ఇందులో వెల్గటూరుకు చెందిన MEO భూమయ్య(57) కూడా ఉన్నారు. జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, NZB, నారాయణపేట, మంచిర్యాల జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 22 జిల్లాల్లో వడగాలులు వీయగా.. హైదరాబాద్లో గాలిలో తేమ 15శాతానికి పడిపోయింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
SSM