తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టో (Manifesto)లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, కాంగ్రెస్ నేతలు తరుచూ చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో అసలు 2 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నాయా… లెక్కలు తీసుకున్న తర్వాతే హామీలు ఇచ్చారా ? నిజంగా ఏడాదిలో భర్తీ చేయడం సాధ్యమవుతుందా ? నమ్ముకొని ఓట్లేసిన నిరుద్యోగులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా ?
తెలంగాణలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్. అధికారంలోకి వచ్చిన దాదాపు 2 నెలల కాలంలో ఇప్పటికి కొత్తగా మంజూరు చేసింది 60 గ్రూప్ 1 పోస్టులు మాత్రమే. ఇంకా లక్షా 99 వేల 9 వందల 40 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే తెలంగాణలో ఖాళీలు ఉన్నవి పాతిక నుంచి 30 వేల పోస్టులు మాత్రమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకవేళ ఈ ఏడాదిలో రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీస్ ని కూడా కలుపుకుంటే… మరో 20 వేల పోస్టులు మాత్రమే పెరుగుతాయని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, ఇతర సంస్థల్లో ఉన్న ఖాళీలను గత BRS ప్రభుత్వం గుర్తించలేదని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. కానీ ఇవన్నీ కలిపినా 2 లక్షల ఉద్యోగాలు ఉండవంటున్నారు నిపుణులు. రాష్ట్ర ప్రభుత్వం కొంద మొత్తం ఉద్యోగాల సంఖ్య 3 లక్షల 50 వేల దాకా ఉంటే… కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కింద 3 లక్షల 46 మంది ఉన్నారు. రాష్ట్రం పరిధిలోని 90 కార్పొరేషన్లలో లక్షా 69 వేల పోస్టులు ఉన్నాయి.
2021లో C.R బిశ్వాల్ పే రివిజన్ కమిటీ ఇచ్చిన రిపోర్టులో తెలంగాణలో లక్షా 96 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. చాలా శాఖలో ఏళ్ళ తరబడిగా పోస్టులను భర్తీ చేయడం లేదని తెలిపింది. మంజూరైన పోస్టుల్లో 61శాతం మాత్రమే ఫిల్ అయ్యాయని కమిటీ రిపోర్టులో పేర్కొంది. కానీ 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 యేళ్ళకు పెంచింది. దాంతో రెండేళ్ళుగా రిటైర్మెంట్స్ తగ్గాయి. ఈ ఏడాది నుంచి ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు. అయితే బిశ్వాల్ కమిటీ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల గుర్తింపులో కొన్ని తప్పులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ కమిటీ రిపోర్టులో స్టెనో గ్రాఫర్స్, టైపిస్టులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలైన డ్రైవర్ల, స్వీపర్లు లాంటి పోస్టులను కూడా చేర్చారు. సాధారణంగా ఇలాంటి పోస్టులను ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంటోంది.
ప్రస్తుతం టైపిస్టుల స్థానంలో కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. లెక్కల్లో చూపించినట్టు ఈ పోస్టులు వేకెంట్ లేవు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటిని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తే… మరికొన్ని ప్రమోషన్లతో ఫిలప్ అవుతాయి. ఎంత చేసినా ఖాళీలు 25 వేల నుంచి 30 వేలు మాత్రమే ఉంటాయి. ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి… కొత్తగా రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని అనుకుంటే… అప్పుడు వాళ్ళు ఆందోళనకు దిగే అవకాశం ఉంటుంది. కానీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కాకున్నా… కనీసం 50 నుంచి 60 వేల కొలువులు భర్తీ చేసినా… అది కాంగ్రెస్ గవర్నమెంట్ కు ప్లస్సే అవుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వానికి నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. లేని ఉద్యోగాలను క్రియేట్ చేస్తే… అది ప్రభుత్వానికి భారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ సమస్యను రేవంత్ ప్రభుత్వం ఎలా తీరుస్తుంది అన్నది చూడాలి.