Morocco earthquake: మొరాకోలో మరణ మృదంగం.. భూకంపం విసిరిన పంజాకి వేల ప్రాణాలు బలి

మొరాకోలో సంభవించిన భారీ భూకంపం. శిధిలాల కింద చిక్కుకున్న వేల మంది స్థానికులు. గాల్లో కలిసిపోయిన 2వేలకు పైగా ప్రాణాలు.

  • Written By:
  • Updated On - September 11, 2023 / 08:09 AM IST

మొరాకో ఉత్తర ఆఫ్రికా దేశంలోని ఒక ప్రాంతం. ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, ఇటుకలతో నిర్మించిన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పర్యాటక ప్రదేశం. ఇక్కడి ప్రజల ప్రదాన వృత్తి వ్యవసాయం అయితే బ్రతికేందుకు దోహదపడేది టూరిజం. ఈ రెండింటినే నమ్ముకొని జీవనం సాగే ఈ ప్రాంతం మృత్యుఘోషతో విలవిలలాడుతుంది. టూరిజంతో కళకళలాడాల్సిన ఈ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెను భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా అక్కడి ఇళ్లన్నీ స్థానికులు చూస్తుండగానే పేకమేడల్లా కప్పకూలిపోయాయి. శిధిలాల కింద కొన్ని వేల మంది క్షతగాత్రలు చిక్కుకుపోయారు. ఇందులో 2వేల మందిని బయటకు తీయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. మరో 2వేల మంది మరణించారు. ఇంకా 1500 మంది శిధిలాల క్రింద చిక్కుకొని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు సహాయక సిబ్బంది.

120 ఏళ్లలో ఇదే తొలిసారి..

ఉత్తర ఆఫ్రికా దేశంలోని మొర్రకేశ్ సహా మిగిలిన 5 ప్రాంతాల్లో భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇక్కడ అప్పుడప్పుడూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి కానీ ఈ స్థాయిలో విపత్తు సంభవించడం 120 ఏళ్ళ తరువాత ఇదే మొదటి సారి అంటున్నారు అధికారులు. 1960 లో రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే తాజాగా ఏర్పడిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8 గా ఉందని గుర్తించారు శాస్త్రవేత్తలు.

సహాయక చర్యల్లో జాప్యం..

ఇక్కడి ప్రదేశాలన్నీ కొండలు, గుట్టలతో ఉంటుంది. చాలా మంది చిన్న చిన్న గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో అక్కడకి సహాయక సిబ్బంది చేరుకునేందుకు చాలా కష్టంగా మారింది. ఎత్తైన కొండప్రాంతాలు, నగరానికి చాలా దూరంలో ఉండటంతో భూకంప శిధిలాలను దాటుకొని బాధితులను కాపాడేందుకు అంబులెన్సులు, టాక్సీలు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు, ప్రభుత్వ యంత్రాంగం, రక్షణ బలగాలు అక్కడకు చేరకోవడం ప్రదాన సమస్యగా మారింది. దీంతో సహాయం అందించేందుకు కొన్ని సేవా సంస్థలు స్వచ్ఛందంగా  ముందుకు వచ్చాయి. అయనప్పటికీ క్షతగాత్రులకు తగిన సమయానికి సరైన వైద్యం అందించడంలో ఆలస్యం ఏర్పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

రోడ్లపైనే గూడారాలు..

అట్లాస్ పర్వత ప్రాంతాల్లో మౌలే బ్రహీం అనే పర్యాటక ప్రాంతం చాలా అద్భతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో దాదాపు 3వేలకు పైగా జనాభా నివసిస్తూ ఉంటారు. తాజాగా ఏర్పడిన భూకంపం ధాటికి ఇళ్లన్నీ నేలకూలాయి. దీంతో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి తలదాల్చుకుందాం అనుకుంటే భయపడుతున్నారు స్థానికులు. అందుకని అక్కడి ప్రదాన కూడలిలో టెంట్లు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ భూకంపం ధాటికి విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు రోజుల నుంచి చీకటి కోరల్లో చిక్కుకొని బిక్కు బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు.

2 Thousand People Died In Morocco Earthquake

స్థానికుల గోడు..

ఈ భూకంపం ప్రభావంతో తాను సర్వస్వం కోల్పోయానని ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు బాధితుడు. తనకు భార్య, ఇధ్దరు పిల్లలు ఉన్నారని ఒక పాప మాత్రమే శిధిలాలలో దొరికిందని.. భార్యాతో పాటూ మరో పాప లోపల చిక్కుకుందని తన గోడు విలపించారు. అలాగే మరో స్థానికురాలు మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి మేము బయటకు పరుగులు తీశామన్నారు. అయితే తన ఇంటి పక్కనే ఉన్న నలుగురు స్నేహితులు తమ కళ్ల ముందే భూకంపంలో చిక్కుకొని శిధిలాల క్రింద ఉండి పోయారని ప్రత్యేక్ష పరిస్థితులను చెప్పుకొచ్చారు. 10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఒకరు ఇలా రకరకాల ఆర్థనాదాలతో పర్యాటక ప్రదేశం ప్రాణ సంకటంగా మారిపోయింది.

మనోళ్ళ పరిస్థితేంటి..

మొరాకో పర్యాటకానికి వెళ్లిన భారతీయులు సురక్షితంగా ఉన్నారని అక్కడి దౌత్యకార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే వివిధ పనుల మీద ఇక్కడకి వచ్చి స్థిర పడిన భారత పౌరుల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్న సమాచారాన్ని వెల్లడించింది. ఏదైనా ఇబ్బందికరపరిస్థితులు తలెత్తినట్లుయితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 212661297491 కి ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా కోరింది. ప్రభుత్వాలు, అక్కడి సహాయక సిబ్బంది ఇచ్చే గైడ్ లైన్స్ ను పాటించి సురక్షితంగా ఉండాలని సూచిందింది.

T.V.SRIKAR