సాధారణంగా మనం ఏదైనా ప్రదేశానికి త్వరగా వెళ్లాలంటే విమాన మార్గాన్ని ఎంచుకుంటాం. దీనికి కారణం పనిలో ఆలస్యం కలుగకుండా సౌకర్యవంతంగా ప్రయాణాన్ని కొనసాగించడమే. అయితే తాజాగా ఇరాన్, ఇరాక్ దేశాల్లో విమాన సర్వీసులు సమయానికి గమ్యస్థానాలను చేరుకోవడంలో విఫలమయ్యాయి. దీనికి కారణం జీపీఎస్ లో తలెత్తిన సాంకేతిక లోపం అని తేలింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 విమానాలు కేవలం 15రోజుల వ్యవధిలో ఇలా దారి తప్పాయి. దీంతో ప్రతి ఒక్కరిలో భయాందోళన మొదలైంది. విమాన ప్రయాణం అంటే బాప్రే అంటూ నోరెళ్లబెడుతున్నారు.
సిగ్నల్ స్పూఫింగ్ అంటే..
ఇలా పెద్ద ఎత్తున విమాన సేవల అంతరాయానికి కారణం జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటున్నారు నిపుణులు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం సిగ్నల్ స్పూఫింగ్ అంటే ఉపగ్రహాల నుంచి విమానాలకు అందే సంకేతాలను అడ్డుకునేలా చేయడం. ఇలా చేయడంతోపాటూ సరికొత్త సంకేతాలను పంపి నావిగేషన్ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపడమే అంటున్నారు పరిశోధకులు. దీనిని ఒకమాటలో చెప్పాలంటే విమాన సంకేతాలు హాకింగ్ కి గురికావడం అని చెప్పవచ్చు. దీనిని ప్రభావంతో ఎటు వెళ్లాల్సిన విమానం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుంది. ఇలా రహస్యంగా శాటిలైట్ సిగ్నలింగ్ వ్యవస్థని మ్యానిపులేట్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందులో మొదటిది జీపీఎస్ తప్పుడు టైం ని చూపించడం, మరొకటి అనుకున్న ప్రదేశానికి బదులు వేరొక ప్రదేశానికి తీసుకెళ్లే పరిస్థితులకు తలెత్తుతాయి. దీని ద్వారా ప్రయాణీకులు గందరగోళానికి, ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఇప్పటి వరకూ దారి తప్పినవి ఇవే..
నిత్యం యుద్దాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అక్కడి పరిస్థితులను ఎవరూ అంచనా వేయలేని ప్రాంతాలు ఇరాన్, ఇరాక్. ఇక్కడ ఈ సిగ్నలింగ్ లోపం వల్ల చాలా విమానాలు దారిమళ్లింపుకు గురికాబడ్డాయి. వీటిని చాకచక్యంగా పైలెట్లు సురక్షితంగా చేర్చారు. ఇలా తప్పుడు సంకేతాలకు గురైన విమానాల్లో బోయింగ్ 777, 737, 747, ఎంబ్రార్ లెగసీ 650 ఉన్నాయి. ఇవేకాకుండా మన దేశానికి చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా వంటి ప్రముక సర్వీసులు ఉన్నాయి. ఇదే మార్గంలో శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, బాకూ, ఆంకారా లకు వెళ్లే విమానాలు ఉంటాయి. అవి దారితప్పాయా లేక సజావుగా తమ గమ్యాన్ని చేరుకున్నాయా అన్న విషయం బయటకు రాలేదు. ఇందులో కొన్ని విమానాలు ఇరాన్ ఏటీసీ అధికారులు ఇచ్చిన సమాచారంతో ప్రమాదం నుంచి బయటపడ్డాయి.
జామింగ్ వ్యవస్థలు గల దేశాలు..
ఇరాన్ ఇరాక్ పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఈ సిగ్నలింగ్ వ్యవస్థను మ్యానుపులేట్ చేస్తూ ఉంటారు. ఉత్తర ఇరాక్ లోని అమెరికా బలగాల వద్ద, అలాగే తుర్కియా వద్ద కూడా ఇలాంటి సిగ్నల్ జామింగ్, స్ఫూఫింగ్ వ్యవస్థలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అర్మేనియా – అజర్ బైజాన్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి. ఈతరుణంలో ఇవి విమానాల రాకపోకలను ప్రభావితం చేసే స్ఫూఫింగ్ సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
T.V.SRIKAR