IPL టికెట్లు పక్కదారి పడుతున్నాయి.. వెబ్ సైట్లోకి రాకముందే… బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయి.. టికెట్లు బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ప్రయత్నిస్తున్నా… క్షణాల్లో టికెట్లు మాయమవుతున్నాయి. ఈ సీజన్ IPL టికెట్ల అమ్మకాన్ని పేటీఎంకు అప్పగించింది బీసీసీఐ. పేటీఎం సైట్‌లో అప్‌లోడ్ చేసిన కొద్దినిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి…! వేల టికెట్లు ఏమవుతున్నట్లు..!
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లంటేనే గగనం. ఎప్పుడోసారి కాని రావు. అలాంటిది ఐపీఎల్ పుణ్యమా అని.. ఏటా మ్యాచులు జరుగుతున్నాయి. ఎంచక్కా మ్యాచ్‌లు చూడొచ్చు అనుకున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. మ్యాచ్‌లు జరుగుతున్నాయి కానీ.. టికెట్లు మాత్రం దొరకట్లేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు పెడతారు కానీ బుక్ అవవు. ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోతాయి. అలా అని… క్రికెట్ ఫ్యాన్స్‌కి దొరుకుతాయా అంటే అదీ లేదు..! టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర.. జింఖానా గ్రౌండ్ దగ్గర వేలమంది పడిగాపులు కాస్తుంటారు.
IPL టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు కేటుగాళ్లు. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. సైట్ లో అప్‌లోడ్ చేయగానే.. నిమిషాల్లోనే వాటిని బ్లాక్ చేస్తున్నారు. తక్కువ ధర ఉండే టికెట్లు… అంటే… 15వందలు, 2వేల 500, 4వేలు, 4 వేల 500, 6వేల రూపాయల టికెట్లు సైట్ లో ఎంత వెతికినా కనపడవు. కేవలం 15 వేలు, 22 వేలు, 30 వేల రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బ్లాక్ మార్కెట్ వెనక పేటీఎం బుకింగ్ సిబ్బంది హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏటా ఇదే పరిస్థితి.
ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55 వేలు… అందులో 60 శాతం టికెట్లు సేల్ చేసుకోవచ్చు. మిగతా 40 శాతం స్పాన్సర్లు, HCA, క్రికెట్ క్లబ్స్, క్రికెటర్ల కోటాలో కాంప్లిమెంటరీ కింద ఉంటాయి. అంటే… కనీసం 35 వేల టికెట్లు అయినా అమ్మాలి. కానీ… మూడు వేల టికెట్లు కూడా అమ్మలేదు. అసలేమైనట్టు. టికెట్ల వెనక పెద్ద బ్లాక్ దందానే జరిగిందా..? లేదా పక్కదారి పట్టాయా..? గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది… అయితే కనీసం మ్యాచ్ టికెట్లు కనపడేవి.. బుక్ చేస్తుంటే ఎర్రర్ వచ్చేది. లేదా.. పేమెంట్ వరకు వచ్చి ఆగిపోయేది. సర్వర్ బిజీ అని వచ్చేది. కానీ.. ఇప్పుడలా కాదు.. హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ అనేదే కనిపించడం లేదు.
మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు… వీఐపీలు, సెలబ్రిటీలు, అధికారులు.. చివరికి మంత్రులకూ తంటాలు తప్పడం లేదు. టికెట్ల కోసం హెచ్‌సీఏ పెద్దలకు వందల కాల్స్ వస్తున్నాయట. కానీ పోలీసులు, HCA మాజీ సభ్యులు, HCA సభ్యులు, ప్రభుత్వ అధికారులకు గౌరవ పూర్వకంగా ఇచ్చే కాంప్లిమెంటరీ టికెట్లు కూడా అమ్మకానికి ఎలా వచ్చాయి. అధికారులు అమ్ముకుంటున్నారా..? పోలీసులే పక్కదారి పట్టిస్తున్నారా..? HCA సభ్యులు కాసులకు కక్కుర్తి పడి అమ్ముతున్నారా ? బ్లాక్ మార్కెట్లోకి కాంప్లిమెంటరీ టికెట్లు ఎలా వచ్చాయనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న.
ఓ వైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పోలీసులకు ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రభుత్వం కూడా ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇదే అదునుగా HCA పాలకవర్గం రెచ్చిపోయింది. స్టేడియం కెపాసిటీ ఎంత..? ఎన్ని టికెట్లు అమ్మకానికి పెడతారు..? ఎన్ని టికెట్లు కాంప్లిమెంటరీ గా ఇస్తారు..? Paytm పారదర్శకంగా టికెట్లు అమ్ముతుందా లేదా..? ఇలాంటివి పట్టించుకునే నాథుడే లేడు. మునుపెన్నడూ లేని రీతిలో బ్లాక్ టికెట్ల దందా ఈసారి జరిగింది. ధోనీ క్రేజ్ ను కూడా సొమ్ము చేసుకున్నారు బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సిరీస్. దాంతో ధోనీ ని గ్రౌండ్ లో చూసేది కూడా ఇదే చివరిసారి అనుకుంటున్నారు ఫ్యాన్స్. టిక్కెట్ ధర ఎక్కువైనా ఫర్వాలేదు. ధోనీని చూడాల్సిందే అనే ఆరాటంలో ఉన్నారు ఫ్యాన్స్.
ఇదే అదునుగా భావించిన బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు…. ఒక్కో టికెట్ పై వెయ్యి రూపాయలు ఎక్కువ ధరకు అమ్మేవాళ్ళు ఇప్పుడు టికెట్ పై పది రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. వెయ్యి రూపాయల టికెట్ 6 వేల పైమాటే పలుకుతోంది. 3 వేల టికెట్ 10 నుంచి 12 వేల రూపాయలకు, ఒక్కోటి 20 వేలైనా కొనేందుకు కూడా క్రికెట్ ఫ్యాన్స్ వెనుకాడటం లేదు. బహిరంగంగా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నా HCA గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. వాట్సప్ చాట్ తో బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. దాంతో యధేచ్ఛగా బ్లాక్ టికెట్ల దందా కొనసాగిస్తున్నారు కేటుగాళ్లు.