హైదరాబాద్ లో ఆ సిలబస్… ఈ సిలబస్ పేరు చెప్పి ఇంటర్నేషనల్ స్కూళ్ళు (International School) పేరెంట్స్ నుంచి అడ్డంగా దోచుకుంటున్నాయి. LKG ఫీజు 4 లక్షల రూపాయలుగా నిర్ణయించాయి. సరిగా మాట్లాడటం రాని… ఇప్పుడిప్పుడే బడికి రావడం అలవాటు చేసుకునే చిన్నారుల ఫీజును ఏకంగా 4 లక్షలుగా నిర్ణయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 65శాతం ఫీజులు ఎక్కువగా పెంచాయి చాలా కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ళు.
బాచుపల్లి (Bachupally) లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ 2023లో నర్సరీ పిల్లలకు 2లక్షల 30 వేల రూపాయలు వసూలు చేసింది. ఈ సంవత్సరం LKGలో చేర్చుకోడానికి 3 లక్షల 70 వేల రూపాయల ఫీజు, ఇతర ఖర్చులు బాదుతోంది. LKGలో అడ్మిషన్ కొనసాగించాలంటే ఈ ఏప్రిల్ లోనే 4 లక్షల ఫీజులు కట్టాలని నోటీసులు పంపింది. తాము IB కరిక్యులమ్ లో చదవు చెబుతామని… అందువల్ల ఫీజులు పైసా కూడా తగ్గించేది లేదని తెగేసి చెప్పింది ఓ పేరెంట్ వాపోయాడు. ఇంటర్నేషనల్ స్టడీస్ (International Studies) పేరు చెప్పి… లక్షల్లో ఫీజులు వసూలు చేస్తే… ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పేరెంట్స్ చాలామంది తమకు స్కూల్ నుంచి వచ్చిన నోటీసులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
సాధారణంగా ఏ స్కూల్ అయినా 10నుంచి 12 శాతం మాత్రమే గత ఏడాది కంటే ఎక్కువగా ఫీజులు పెంచుతాయి. కానీ కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ళు మాత్రం 65 నుంచి 70శాతం దాకా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. IB, కేంబ్రిడ్జ్ స్కూళ్ళల్లోనే ఈ ఫీజుల మోత తీవ్రస్థాయిలో ఉంటోందని పేరెంట్స్ చెబుతున్నారు. అయితే CBSE స్కూళ్ళల్లోనూ ఫీజుల మోత బాగానే ఉందంటున్నారు కొందరు తల్లిదండ్రులు. కూకట్ పల్లి ఏరియాలో CBSE (CBSE) లో అడ్మిషన్ కు కనీసం లక్షల నుంచి 4 లక్షల రూపాయల దాకా ఫీజులు ఉన్నట్టు తేలింది.
ఈసారి వసతులు పెంచామనీ కొందరు స్కూళ్ళ యజమానులు చెబుతుంటే… మరికొందరు మాత్రం మార్కెట్లో రేట్లు పెరిగాయనీ… మీకు మాత్రం శాలరీలు పెరగలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మంచి ఫ్యాకల్టీ కావాలంటే ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తోందనీ… అందుకే ఫీజులు పెంచుతున్నట్టు చెబుతున్నారు. కొన్ని స్కూళ్ళయితే పిల్లలకు ఆటవస్తువులు, ఇతరత్రా యాక్టివిటీస్ చేయించాలంటే ఆ మాత్రం ఫీజులు పెంచాల్సిందే అంటున్నాయి. గతంలో తెలంగాణలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సులు ఏవీ ఇప్పటికీ అమలు కావడం లేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ చర్యలు తీసుకోవాలనీ… విద్యాసంస్థల అడ్డగోలు ఫీజుల దందాకు చెక్ పెట్టాలని పేరెంట్స్ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు.