ఆదిలాబాద్ (Adilabad) ఎంపీ (MP) టిక్కెట్ కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, పది మంది కాదు, పాతిక మంది కాదు. ఏకంగా 42 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారట. ముక్కూ ముఖం తెలియని వాళ్ళు, పార్టీ లైన్ లేని వాళ్ళు ఎవరెవరో వచ్చి అక్కడ బీజేపీ (BJP) టిక్కెట్ కోసం దరఖాస్తు చేశారు. అప్లికేషన్స్ చూసి ఆశ్చర్యపోయి ఆరా తీసిన బీజేపీ పెద్దలకు విషయం తెలిసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. లోకల్ లీడర్స్ అందర్నీ పిలిచి ఎడాపెడా క్లాస్ పీకి పంపారట.
ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం బీజేపీలో పెద్ద ఎత్తున పోటీ ఉంది. సిట్టింగ్ సీటుతో పాటు ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఉండటంతో గెలుపు ధీమాతో ఎగబడుతున్నారు ఆశావహులు. ఇదే ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారుతోందట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు… ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా నాయకులంతా తమకు తెలిసిన వారంటూ ఒక్కొక్కర్నే రేస్‌లోకి తీసుకు రావడంతో వెయిట్ పెరిగిపోతోందట. మా వాళ్ళకు టిక్కెట్ అంటే మావాళ్ళకు కావాలంటూ నేతలు పోటీ పడుతుండటంతో… చెక్ పెట్టకుంటే చివరికి నష్టం జరుగుతుందని గ్రహించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అందర్నీ పిలిచి కామన్ క్లాస్ పీకారట.
ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు (Soyam Bapurao) గెలిచినప్పటి నుండి ఎవరికీ అందుబాటులో లేరనీ, ఆయన ఎక్కడా తిరగలేదని ఎమ్మెల్యేలు… నేతల ద్వారా ఫిర్యాదు చేయించారట కొందరు. సొంత నియోజకవర్గాలో వేరే నేతలను ప్రోత్సహించారని నేరుగా ఎమ్మెల్యేలే అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. అదే సమయంలో, ఎంపీ టిక్కెట్టు తమకే వస్తుందని కొందరు నేతలు అత్యుత్సాహంతో ప్రచారం కూడా చేసుకుంటుండం ఆసక్తికరంగా మారింది. మావాడంటూ రోజుకో నేత ఒకర్ని తీసుకుని పార్టీ పెద్దల్ని కలుస్తుండటంతో చిరాకు పుట్టిన రాష్ట్ర అధ్యక్షుడు ఇక మీదట ఇలాంటివి మానుకోవాలని, లేదంటే మీరే బద్నాం అవుతారని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. టికెట్ కోసం పార్టీ లైన్ లేని వారిని, జడ్పీటీసీ స్థాయి కూడా లేని వారిని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ పేర్లతో ఫ్లెక్సీలు పెట్టించడం, ఈ క్రమంలో పార్టీలో గ్రూప్‌లు పెరిగిపోవడం ఇబ్బందిగా మారిందట. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలపై ఎంపీ సోయం బాపూరావు ఏకంగా పార్టీ పెద్ద అమిత్‌షాకు ఫిర్యాదు చేశారట. ఆ సమాచారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావడంతో… టిక్కెట్ పేరుతో చోటా మోటా లీడర్స్‌ని తీసుకువచ్చి పార్టీని బద్నాం చేయవద్దు, మీరు ఆగం కావద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం ఏకంగా 42 దరఖాస్తులు వచ్చాయట. అది చూసి షాకైన అధిష్టానం ఆరా తీస్తే ఈ ఛోటామోటా వ్యవహారం బయటపడిందంటున్నారు. దీని వెనక కొందరు నేతలు ఉన్నారనీ… వారి ద్వారానే అసలు ఊరు పేరు లేనివారు సైతం దరఖాస్తులు నింపి పంపినట్టు పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఎంపీ సోయంకు చెక్ పెట్టేందుకే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు అధిష్టానం దృష్టికి వచ్చిందట. అటు సోయం బాపూరావుకు చెక్ పెట్టడంతో పాటు తమ వారిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో నేతలు, ఎమ్మెల్యేలు ఇలా చేసినట్లు గ్రహించారు అగ్రనేతలు. అందుకే జిల్లా నేతలకు రాష్ట్ర నాయకత్వం ఓ రేంజ్‌లో క్లాస్ పీకినట్టు సమాచారం. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? నేతల మధ్య పొరపొచ్చాలకు కారణమేంటని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. మీరు ఇలాగే గొడవలు పడితే గెలిచే సీటు కాస్తా చేజారి పోతుందని వార్నింగ్ ఇచ్చారట. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నంత సేపు ఎవరికి వారు తేలు కుట్టిన దొంగల్లా కామ్‌గా ఉన్నారరట. ఇక మీదైనా మారతారా? నియోజకవర్గానికి వెళ్లాక మా దారి మాదేనంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.