ఆరు… ఈ నెంబర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ కి చాలా సెంటిమెంట్. ఆయన ఏ పని చేసినా ఆరు అంకెను దృష్టిలో పెట్టుకొని చేసేవారు. తన లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలాగా తెలంగాణలో జిల్లాల పునర్విభజన కూడా జరిగింది. 33 జిల్లాలు… ఈ రెండు అంకెలు కూడితే వచ్చేది 6… అలాగే తన లక్కీ నెంబర్ ప్రకారమే… అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో లోక్ సభ ఎన్నికల్లో కూడా కారు… సారు… పదహారు అంటూ ముందుకెళ్ళారు. వాస్తు, జాతకాలు, యాగాలు, పూజలు అన్నీ బలంగా నమ్ముతారు కేసీఆర్. అలాగే లక్కీ నెంబర్ ని కూడా..
కేసీఆర్ కి సిక్స్ ఎంత సెంటిమెంట్ అయినా… అది ఈమధ్య కలిసి రావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం… లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవకపోవడం ఇలా వరుస ఓటములు ఎదురవుతున్నారు. అదేం చిత్రమో గానీ… కేసీఆర్ ఆరు సెంటిమెంట్ కాంగ్రెస్ కి బాగా కలిసొస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో జనంలోకి వెళ్ళిన ఆ పార్టీ అధికారం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ సిక్స్ సెంటిమెంట్ ని దెబ్బతీసేలాగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు.
ఇప్పటికి ఆరుగురు BRS ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈమధ్యే ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. మరో ఆరుగురు ఎమ్మెల్సీలు జాయిన్ అవుతారని అంటున్నారు. GHMC కౌన్సిల్ లో రచ్చ చేయాలంటూ… తెలంగాణ భవన్ లో ఓ మీటింగ్ పెడితే దానికీ… ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో శనివారం నాడు సెక్రటేరియట్ లో సమావేశం అయ్యారు. ఈ ఆరుగురు కూడా కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని అంటున్నారు. మొత్తానికి ఆరును నమ్ముకున్న కేసీఆర్ నిండా మునిగిపోతున్నారు. గులాబీ బాస్ కు ఇప్పుడా ఆరు లక్కీనెంబరే శనిలా దాపురించింది.