ఓలా సంస్థ ప్రస్తుతం ఎలక్ట్రానిక్ బైకులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అవి గతంలో ఫెయిల్యూర్ అయినప్పటికీ ఇప్పుడు మంచి గిరాకీ పెరిగింది. దీని ధర రూ. లక్షకుపైగా ఉంటుంది. అయితే బెంగళూరుకు చెందిన రైడర్లకు మాత్రమే ఈ ప్రకటన వర్తిస్తుందని తెలిపింది. దీనికోసం బెంగళూరులో స్థానికంగా ఉండే బైక్ రైడర్లు ఓలా ఎస్ 1 బైక్ ని రెంట్ కి తీసుకోవాలి. కంపెనీ నిర్థేశించిన ప్రకారం కస్టమర్లకు రైడింగ్ సేవలు అందిస్తే నెలకు రూ. 70వేలు సంపాదించుకోవచ్చని వెల్లడించింది.
సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి
ఈ ప్రకటనపై ఆసక్తి ఉన్న రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 5000 చెల్లించి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైకును తీసుకోవాలి. దీని కంటే ముందుగా అప్లికేషన్ ను పూర్తి చేసి దానితో పాటూ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేయాలి. దీనితో పాటూ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్ని వివరాలు పూర్తి చేసుకున్న తరువాత బైక్ రైడింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ప్రత్యేకంగా ఒక ఐడీని కేటాయిస్తారు. ఇలా ఓలా కంపెనీ చెప్పిన దాని ప్రకారం కస్టమర్లకు రైడింగ్ సేవలు అందిస్తే కమిషన్ రూపంలో కొంత మొత్తాన్ని రైడర్లకు అందించేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బ్రౌచర్ ను విడుదల చేశారు.
రైడ్ వివరాలు ఇలా..
ప్రతి రోజూ 10 నుంచి 14 రైడ్స్ చేయడం వల్ల కచ్చితమైన కమిషన్ రూ. 800 వరకూ రైడర్ల ఖాతాలో జమచేస్తుంది. చెల్లించిన నగదులో రూ. 100 అద్దెకు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే 15 నుంచి 19వ రైడ్ బుకింగ్ పై ప్రత్యేకంగా ఇన్సెన్టివ్ ను ప్రకటించింది. ఈ నాలుగు రైడ్స్ చేయడం వల్ల రోజుకు అదనంగా రూ. 1300 వరకూ సంపాదించవచ్చు. దీనికి ప్రత్యేకంగా రూ. 50 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటూ మరో ప్రత్యేకమైన ఆఫర్ ను వెల్లడించింది. ప్రతి రోజూ 20 కంటే ఎక్కువ బుకింగ్స్ తీసుకుని రైడ్ చేసే డ్రైవర్లు రోజు వారి అద్దె చెల్లించనవసరం లేదని ప్రకటించింది. 20 రైడ్ల కంటే ఎక్కువ బుకింగ్స్ చేయడం వల్ల రోజుకి రూ. 1800 నుంచి 2800 వరకూ సంపాదించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతి రోజు 10 కంటే తక్కువ బుకింగ్ లు స్వీకరించే వారికి ఎలాంటి కచ్చితమైన ఆదాయం లభించదని స్పష్టం చేసింది. పైగా రూ. 300 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఛార్జీల వివరాలు..
గతంలో ఓలా వినియోగదారుల సౌకర్యార్థం ఒక నిర్థిష్టమైన ధరను నిర్ణయించింది. దాని ప్రకారమే ఓలా రైడ్లకు ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. బైక్, ట్యాక్సీ సర్వీస్ 5 కిలోమీటర్ల వరకూ అయితే రూ. 25 చెల్లిస్తే.. 10 కిలోమీటర్ల వరకూ ప్రయాణానికి రూ. 50 గా నిర్ధారించింది. తాజాగా వెలువడిన ఒక నివేదిక ప్రకారం.. ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసిన ఓలా ఎస్1 బైక్ 70-75 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అంటే ఏడు లేదా ఎనిమిదో రైడ్ వద్ద బైక్ బ్యాటరీ కెపాసిటీ పడిపోతుంది. అప్పుడు తిరిగి ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీని కోసం కనీసం ఆరు గంటల సమయం కేటాయించాలి. ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా 10 బుకింగ్స్ తీసుకుంటే రోజుకు . 800 స్థిరమైన ఆదాయం వస్తుంది. బైక్ చూస్తే ఎనిమిదవ రైడ్ వద్ద ఆగిపోతుంది. అప్పుడు ఏలా చేయాలో తెలుసుకునేందుకు తన అధికారిక వెబ్ సైట్లో ఒక పోస్ట్ చేసింది. ఇందుకోసం 10 కిలోమీటర్ల కంటే తక్కువ పరిధి ఉండే రైడ్లను తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా 70-75 కిలోమీటర్ల పరిధిలో 10 రైడ్లు విజయవంతంగా పూర్తి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపింది.
T.V.SRIKAR