అభిమానం నిరూపించుకోవాలంటే బానిసత్వం బయట పడాలంతే..! హీరోలకు ఎంత బానిసత్వం చేస్తే అంత పెద్ద అభిమాని అన్నట్టు లెక్క! మన హీరోని తక్కువ చేసిన వాళ్లని ఎన్నీ బూతులు తిడితే అంత వీరాభిమాని అన్నట్టు! ఏదో సినిమా చూశామా వచ్చేశామా అని ఉండకూడదు! ఎవరైనా మన హీరో జోలికొస్తే అవతలి వాళ్లు ఎవరైనా కావొచ్చు.. ఆడా..మగా.. చిన్నా..పెద్దా తేడా ఏమీ చూడాల్సిన పనిలేదు.. నోటికొచ్చినట్లు కామెంట్ చేశామా.. లేదా.. అదే లెక్క..! సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ, విజయ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ పీక్స్‌కు వెళ్లింది.
ఆరేళ్లుగా సాగుతున్న యుద్ధం:
అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. పబ్లిక్‌గా స్టేజ్ మీద “ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ **” అంటూ హీరో విజయదేవరకొండ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు విమర్శించారు. ఈ డైలాగ్‌ను వ్యతిరేకించిన వాళ్లలో యాంకర్ అనుసూయ కూడా ఉన్నారు. దీంతో విజయదేవరకొండ అభిమానులకు కోపం వచ్చింది. కీ బోర్డు, కీ ప్యాడ్ అస్త్రాన్ని ప్రయోగించారు.. అంటే ట్రోలింగ్‌కు పని చెప్పారన్నమాట..! అంతకంటే చేయగలిగింది ఎలాగో ఏమీ ఉండకపోవడంతో కొంతమంది బూతులకు కూడా పని చెప్పారు. ఆమెను నోటికివచ్చినట్లు తిట్టిపడేశారు.. ఆంటీ ఆంటీ అంటూ ఆమెకు ఒక ట్యాగ్ వేశారు. ఆ కామెంట్స్‌తో సహనం కోల్పోయిన అనసూయ.. వారిపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఆ తర్వాత వారిద్దరూ(విజయదేవరకొండ, అనసూయ) కలిసి ఆ మధ్య ఏదో సినిమాలో నటించారు..! సినిమా పేరు ‘మీకు మాత్రమే చెప్తా’..! వాళ్లు ఎవరికి ఏం చెప్పారో తెలిసేలోపే ఆ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. సరే ఆ సినిమా సంగతి పక్కన పెడతాం.! ఆ సినిమాలో విజయదేవరకొండ, అనసూయ కలిసి నటించడంతో వారిద్దరి మధ్య ఎలాంటి ఇష్యూ లేదని జనాలు ఫిక్స్ అయ్యారు.
అప్పుడే ఐపోలేదు..ఇప్పుడే మొదలైంది:
తాజాగా మరోసారి అనసూయ చేసిన ట్వీట్‌తో రచ్చ మొదలైంది. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషీ’ పోస్టర్‌పై ఇండైరెక్ట్‌గా ట్వీట్ చేసింది అనసూయ. ఈ పోస్టర్‌లో ‘THE విజయ్ దేవరకొండ’ అని రాసుంది. దానిపై అనసూయ ‘The’ అని ప్రస్తావిస్తూ “ఇప్పుడే ఒకటి చూశాను.. ‘The’నా?? బాబోయ్.. పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం” అంటూ ట్వీట్ చేసింది. దీంతో.. అనసూయపై విజయదేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
ఆంటీ ఆంటీ అంటూ మళ్లీ రచ్చ:
ట్రోలింగ్ చేయడానికి కొత్తగా ఐడియాలేమీ పుట్టుకొచ్చినట్లు లేవు.. మరో సారి ‘ఆంటీ ఆంటీ’ అంటూ.. ‘The’ ఆంటీ అంటూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే ఓ డౌట్ కొంతమందికి వచ్చింది. 37ఏళ్ల అనసూయ ఆంటీ ఐనప్పుడు 34ఏళ్ల విజయదేవరకొండ కూడా దాదాపు అంకులే అవ్వాలి కదా అని.. రాజ్యాంగం ప్రకారం ఏ ఏజ్‌లో ఆంటీ, అంకుల్ అని పిలవాలి అన్ని చెప్పడానికి ఎలాంటి ఆర్టికల్ లేదు.. ఇలాంటి గొడవలు జరుగుతాయని తెలిసి ఉంటే అప్పట్లోనే రాజ్యాంగ నిర్మాతలు ఓ ఏజ్‌ని సూచించేవారేమో!
సరే 34ఏళ్ల విజయదేవరకొండ అంకుల్ కాదనుకుందాం.. మరీ 40ఏళ్లు దాటిన హీరోలను అన్న అన్న అంటూ వారి వెనకి పడతారేమ్? వాళ్లంతా అనసూయ కంటే పెద్ద వాళ్లే కదే..? వాళ్లు అంకుల్స్ అవ్వరు కానీ అనసూయ మాత్రమే ఆంటీ అవుతుందా? పితృస్వామ్య దేశాలు,పితృస్వామ్య రాజ్యాలు ఉన్నట్టే..పితృస్వామ్య ఫ్యాన్స్ కూడా ఉంటారని అర్థమవుతుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి బయట ఎవరైనా 60ఏళ్లు దాటిన వారు కనిపిస్తే తాతయ్య అని పిలుస్తుంటాం.. కానీ హీరోలను మాత్రం 65ఏళ్లు దాటినా అన్న అనే పిలవాలి..! అనసూయ లాంటి వాళ్లు మాత్రం 37ఏళ్లకే ఆంటీలు ఐపోతారు.. ఆమె మాత్రమే కాదు.. హీరోయిన్‌కి పెళ్లైతే చాలు.. ఆమె ఆంటీనే..! హీరోలకు మాత్రం పెళ్లిళ్లు అయినా కూడా అన్ననే.. చిన్నబాబే..చంటిబిడ్డే..! ఇదంతా ఎందుకు.. అసలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అంకుల్సే లేరు..! అది అంతే..