ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సభ్యుడు దీప్‌దాస్ మున్షీ, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ థాక్రే ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంటరీ అబ్జర్వేషన్ మీటింగ్ అనంతర పీఏసీ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కర్నాటక తరహా వ్యూహాన్ని అనుసరించాల్సిందిగా ఏఐసీసీ ప్రతినిధులు తెలంగాణ నేతలకు సూచించారు. ఎన్నికలు ముగిసేవరకూ నేతలంతా ఒకే మాటపై పని చేయాలంటూ సూచించారు.
కర్నాటలో ప్రభుత్వం అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ అయ్యారు. తెలంగాణలో కూడా ఇదే ఎజెండా పెట్టుకోవాలని పీఏసీ మీటింగ్‌లో నిర్ణయించారు. పాలన మొత్తం ఒక కుటుంబం చేతిలోనే బంధీ ఐపోయిందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటూ ఏఐసీసీ నేతలు టీపీసీసీ నేతలకు సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల్లో జరిగిన అవినీతి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ నేతల నిర్ణయం. ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్‌ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 30 నియోవర్గాలకు క్యాండిడేట్‌లను త్వరలో డిక్లేర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మరింత ఫోకస్ పెంచబోతోంది టీపీసీసీ.
ఎన్నికలు ముగిసేవరకూ నియోజకవర్గాల ఇంచార్జ్‌లు స్వంత నియోజకవర్గాల్లోనే ఉండాలని పీఏసీ సభ్యులు సూచించారు. ఏది ఏమైనా ఈసారి తెలంగాణలో జెండా ఎగరేయడమే ధ్యేయంగా పని చేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు.