Asteroid: గ్రహ శకలం భూమిని ఢీ కొట్టబోతోంది.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన నాసా శాస్త్రవేత్తలు..

అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్‌ తొలి శాంపిల్‌ను భూమి మీదికి తీసుకొచ్చింది నాసా.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 01:51 PM IST

అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్‌ తొలి శాంపిల్‌ను భూమి మీదికి తీసుకొచ్చింది నాసా. ఓసిరిస్‌ ఎక్స్‌ అనే అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి కాప్సుల్‌ ద్వారా బెన్నూ అని పిలిచే ఈ ఆస్టరాయిడ్‌ శాంపిల్‌ను పంపింది. ఈ శకలాలను హ్యూస్టన్‌ లోని నాసా జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. పావుకేజీ పరిమాణంలో ఉండే గ్రహశకలంపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి ఈ ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్‌ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది.

అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని నాసా అంచనా వేస్తోంది. ఓసిరిస్‌ ఎక్స్‌ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్‌ వైపు పయనిస్తోంది. సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్‌ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం దొరికే చాన్స్‌ ఉంది.