టాలీవుడ్ నటి సమంత సోషల్ మీడియాలో చేసిన ఓ హెల్త్ టిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో సమంత చేసిన ఈ పోస్ట్ వివాదస్పదమైంది. ఆమె స్వయంగా నెబ్యులైజర్ పెట్టుకొని శ్వాస కోశ వ్యాధుల ఇన్ఫెక్షన్ పై ఇచ్చిన ఉచిత సలహా మీద అంతర్జాతీయ వైద్య నిపుణుల దగ్గర నుంచి NRI డాక్టర్ల దాకా అంతా తిట్టిపోస్తున్నారు. తెలిసీ తెలియని సలహాలు ఇవ్వొద్దని అమెరికా డాక్టర్లు సమంతకు వార్నింగ్ ఇస్తున్నారు.
నటి సమంత గత కొంత కాలంగా మయసైటీస్ వ్యాధితో బాధపడుతోంది. వైద్య చికిత్స తీసుకుంటున్న ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటోంది.
ఈ టైమ్ లో కొన్ని వైద్యసలహాలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది సమంత. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ ద్వారా పీల్చమని చెబుతూ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. కామన్ వైరల్ కు మందులు వాడే ముందు… ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, స్వేద జలం కలిపి ఆవిరిపట్టడం ఓ ఆప్షన్. అది మేజిక్ లాగా పనిచేస్తుంది. మెడిసన్ కి ఆల్టర్నేట్ గా పనికొస్తుంది అంటూ మెస్సేజ్ పెట్టింది సమంత. అయితే ఇది ఫాలో అయితే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదంటున్నారు డాక్టర్లు. అంతర్జాతీయ కాలేయ వ్యాధి నిపుణుల డాక్టర్ ఒకరు ట్విట్టర్ లో స్పందించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఆవిరిగా తీసుకోవద్దని … అమెరికాకు చెందిన ఆస్తమా అలర్జీ ఫౌండేషన్ స్వయంగా తెలిపిందన్నారు. హెల్త్ అండ్ సైన్స్ లో ఏ మాత్రం అవగాహన లేని సమంత… తన లక్షల మంది ఫాలోవర్స్ ని తప్పుదోవ పట్టిస్తోందని లివర్ డాక్టర్ X లో మండిపడ్డారు.
సమంత వైద్య సలహా డేంజర్ అని NRI డాక్టర్ శ్రీకాంత్ మిరియాల కూడా X లో స్పందించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్ స్టేబుల్ రసాయనం… ఇది నీరు, ఆక్సిజన్ గా మారుతుంది. ఈ ఆక్సిజన్ అణువులుగా మారే ముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ లాగా పనిచేస్తుంది. దాంతో అప్పటికే వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని ఇంకా దెబ్బ తీస్తుంది. దాంతో న్యుమోనియా లేదంటే ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి దారి తీస్తుంది. ఇవి ఎటాక్ అయితే డైరెక్ట్ గా చనిపోవడమే అంటున్నారు NRI డాక్టర్. సమంత వైద్య సలహాపై నెటిజన్లు మండిపడుతున్నారు. సమంత వైద్య నిపుణురాలు కాదు… తనకు తెలిసీ తెలియని వైద్యాన్ని ఇలా జనం మీద రుద్దడం ఏంటని మండిపడుతున్నారు. వైద్యం తెలియకపోయినా… ఇలా ఉచిత సలహాలు ఇచ్చే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.