Google Flights: తక్కువ ధరలకే ఫ్లైట్ టికెట్లు అందించేలా గూగుల్ నుంచి అద్భుతమైన ఫీచర్..

మనకు రెక్కలు లేకున్నా రెండు రెక్కల విమాన సహాయంతో గాల్లోకి ఎగిరి ప్రయాణం చేయాలని భావిస్తూ ఉంటారు చాల మంది. అయితే ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే అంతే స్థాయిలో ఖర్చు అవుతుంది. కనీస విమాన టికెట్ డొమెస్టిక్ పరిధిలో అయితే రెండు నుంచి మూడు వేల పైమాటే. అయితే తాజాగా గూగుల్ విమాన టికెట్లు తక్కువ ధరలకే అందించేందుకు సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 07:41 AM IST

సాధారణంగా మనం విమానాల్లో ప్రయాణం చేయాలంటే ఒక రోజు లేదా రెండు రోజుల ముందు బుక్ చేసుకుంటూ ఉంటాం. అదే కొన్ని నెలల ముందు అయితే వీటి ధర కాస్త తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా తీసుకొచ్చిన గూగుల్ ఫీచర్ ద్వారా ఎప్పుడైనా సరే తక్కువ ధరలకు టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొన్ని సార్లు గంటల వ్యవధిలోనే విమాన ఛార్జీలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఒక్కో సారి అయితే టికెట్ బుక్ చేసుకున్న వెంటనే అమాంతం ఫ్లైట్ టికెట్ ధర పడిపోవచ్చు. అప్పుడు కాసేపు ఆగి టికెట్ బుక్ చేసుకుని ఉంటే బాగుండేదని భావించే వాళ్లు వేలల్లో ఉంటారు. అలాంటి వారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఏర్పాటు..

ఈ ఫీచర్ ని ఉపయోగించడం వల్ల్ టికెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసాలను ఇట్టే చెప్పేస్తుంది. ఇలా చెప్పేలా దీని ప్రోగ్రామింగ్ రూపొందించారు. గడిచిన మూడు నాలుగేళ్ల ఫ్లైట్ టికెట్స్ ధరల హెచ్చుతగ్గుల సమాచారాన్ని ఇందులో పొందుపరిచి ఉంటారు. వాటిని ఆధారంగా ఏ సమయంలో తక్కువ ధరలకు టికెట్లు లభిస్తాయి. ఏ సందర్భాల్లో ఫ్లైట్ ధరల్లో హెచ్చులు కనిపిస్తాయో ముందే గమనించవచ్చు. ఇందులో చూసుకొని బుకింగ్ విషయంలో ఒక అంచనాకి రావడానికి వీలు పడుతుంది. ఈ గూగుల్ ఫ్లైట్స్ ఫీచర్ లో ఫ్లైట్ టేకాఫ్ అయ్యే వరకూ కూడా టికెట్ ధరల్లో తేడాలను చూసి బుక్ చేసుకునేలా ఉపయోగపడుతుంది. ఈ గూగుల్ ఫ్లైట్ గురించి స్వయంగా గూగుల్ సంస్థ తన బ్లాగ్ లో పేర్కొంది.

ఎలా బుక్ చేసుకోవాలి..

ఇంతకూ తక్కువ ధరలకే ఫ్లైట్ టికెట్ మనకు దొరకాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఫ్టైట్ లో ప్రైస్ ట్రాకింగ్ అనే ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ధరలు ఎప్పుడు తగ్గినా, పెరిగినా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనకు నోటిఫికేషన్ రూపంలో అందిస్తుంది. మీ ప్రయాణం ఇప్పట్లో కాకుండా కొన్ని నెలల తరువాత ఉన్నట్లయితే ఆ తేదీని, నెలను పొందుపరచాలి. అప్పుడు గతంలో ఫ్లైట్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించి దానిని బట్టి ధరలను సూచిస్తుంది. తద్వారా మనం తక్కువ ధరలకు టికెట్ ను పొందవచ్చు. ఇలా చేయాలంటే ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ లో లాగిన్ అయి ఉండాలని తెలిపింది.

అధికంగా చెల్లించిన డబ్బులు వాపసు..

టికెట్ ధరలను గుర్తించడమే కాకుండా ఒకవేళ అధికంగా చెల్లించిన మన డబ్బులు తిరిగి చెల్లించే సరికొత్త విధానాన్ని రూపొందించింది. కొన్ని విమాన ప్రయాణాల టికెట్ ధరలపై ఒక ప్రత్యేకమైన మార్కును సూచిస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన రంగులో బ్యాడ్జిని ఉంచుతుంది. ఈ బ్యాడ్జి ఉద్దేశ్యం ఏంటంటే.. గతంలో ఉన్న టికెట్ ధరల కంటే మరింత తగ్గే అవకాశం ఉందని ఒక సూచన ప్రాయంగా తెలుపుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రత్యేకమైన కోటాలో ఉంచిన టికెట్లను బుక్ చేసుకున్నప్పుడు వాటి ధరలు మీరు బుక్ చేసుకున్న దానికంటే తగ్గితే.. అధికంగా చెల్లించిన ధరలను తిరిగి మీ గూగుల్ పే ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుతం దీనిని కొన్ని అకౌంట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రయోగం చేపట్టింది. ఇది విజయవంతం అయితే అన్ని గూగుల్ యూజర్స్ కి అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

T.V.SRIKAR