Brahma Kamalam Flower: అదిగో అల్లదిగో బ్రహ్మ కమలము.. హైదరాబాద్ నగరాన వీచే పరిమళము

బ్రహ్మకమలాలు ఈ పేరును ఎక్కడో విన్నట్లు.. చూసినట్లు ఉంది కదూ. మనకు చాల సినిమాల్లో వీటిని చూపించారు. ఒకప్పటి చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో మెగాస్టార్ ఈ మొక్కల కోసం హిమాలయాలకు వెళ్తాడు. అలాగే తాజాగా బద్రినాథ్ సినిమాలో తమన్నా బ్రహ్మకమలాల కోసం ఎత్తైన కొండలు ఎక్కి వాటిని సేకరించి బద్రీనాథునికి సమర్పించి తనకోరికను తీర్చుకుంటుంది. ఇక విషయానికొస్తే ఇలాంటి అరుదైన మొక్క మన హైదరాబాద్ లో పుష్పించింది. ఇది హిమాలయాల్లో కాకుండా డక్కన్ పీఠ భూమిపై పూచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆల్వాల్ లో నివాసముంటున్న కాతుబండి మణెమ్మ చలపతి రావుల ఇంట్లో ఈ పువ్వులు వికసించాయి. ఈ బ్రహ్మాకమలాలను శ్వేత కమలమని కూడా అంటారని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఒకేసారి 20కి పైగా పూలు తమ ఇంటిలో పూయడం చాలా సంతోషంగా వుందని కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇంతకీ దీని ప్రత్యేకతలేంటో.. దీనిని ఎందుకు వినియోగిస్తారో.. అంతటి పేరు ఈ కమలాలకు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - July 18, 2023 / 07:11 PM IST

బ్రహ్మకమలం ఇవి బద్రీనాథ్, కేదార్ నాథ్, మానస సరోవర్, ఉత్తరాఖండ్, హిమలయాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించే మొక్కలు. దీనిని దేవలోకపు పుష్పం అంటారు. ఇంగ్లీష్ లో కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కకు ఎలాంటి విత్తనాలు అవసరం ఉండదు. కేవలం పత్రాన్ని సగానికి కత్తిరించి మట్టిలో చొప్పిస్తే ఈ మొక్క క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతుంది. దీనికి ఎక్కువ నీరు, వెలుతురు అవసరం ఉండదు. తక్కువ లైటింగ్ కండీషన్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిలో వాస్తు ప్రకారం కూడా ఈ మొక్కను ఏర్పాటు చేసుకుంటారు. ప్రతీ ఇంట్లో బ్రహ్మస్థానంలో మాత్రమే దీనిని ఉంచుతారు. ఎందుకంటే బ్రహ్మస్థానం మనకు ఈశాన్య భాగంలో ఉంటుంది. దేవతలను ప్రతిష్టించే చోట దీనిని ఏర్పాటు చేసుకుంటే దోషాలు నశిస్తాయని కొందరి విశ్వాసం. అలాగే ఈ పుష్పాలతో పూజిస్తే శాంతి, అదృష్టం వరిస్తుందని హిందూ శాస్త్రం చెబుతుంది. ఈ మొక్క నాటినప్పుడు సహచర మొక్కను కూడా నాటాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ కమలం ఫ్రెండ్లీ నేచర్ కి ప్రతీక. అందుకే మరో తోడును కోరుకుంటుంది.

A rare Brahma lotus that blooms in Uttarakhand has bloomed in Alwal in our Hyderabad

ఏడాదికి ఒకసారే పూలు

ఈ బ్రహ్మకమలాలు ఏడాదికి ఒకసారిమాత్రమే పూస్తాయి. అది కూడా పౌర్ణమి రోజు మాత్రమే పుష్పిస్తాయని కొందరు చెబుతారు. ఉదయం మొగ్గలా ముడుచుకొని.. రాత్రి చల్లని వాతావరణంలో వికసిస్తాయట. భూమి మీద ఏ పువ్వైనా సూర్యుని స్పర్శతో మాత్రమే చిరునవ్వులా విచ్చుకుంటాయి. అలాంటిది ఈ మొక్క సూర్యుని ప్రమేయం లేకుండా పెరిగి వెన్నెల కాంతుల్లో వికసిస్తుంది. ఇది వికసించినప్పుడు అద్భుతమైన సుగంధ పరిమళం వెదజల్లుతుంది అని అంటారు. ఈ పువ్వు తిరిగి ఉదయం ఆరు గంటల లోపు ముడుచుకుకుంటుంది. ఇదే దీని ప్రత్యేకత. ఈ పువ్వులు దేవతలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ కమలాలు శ్వేత రంగులో ఉంటాయి. వీటిపై బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో వికసించాయి

ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలు, చేయి పక్షవాతం వచ్చినవారికి ఈ పుష‌్పంతో తైలం, ఔషధాలను తయారుచేస్తారు. అలాగే మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంలో కీలక పాత్రపోషిస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో రాసి ఉన్నట్లు చెబుతారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ పుష్పాన్ని ఉత్తరాఖండ్ తమ రాష్ట్ర పుష్పంగా గుర్తించారు. ఉత్తర భారతదేశంలో వీటిని పవిత్రమైన పూలుగా భావించి హరిహరుల పూజలకు వినియోగిస్తారు. అదే మన దక్షిణ భారతదేశంలో వీటిని రాత్రి వికసించే ఎఫీఫైలామ్, ఆక్సీపెటాలమ్ అనే కాక్టస్ జాతికి చెందిన మొక్కగా కొందరు చెబుతారు. ఇవి మన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం లేదా శీతాకాలంలో పూస్తాయి. ఎక్కడో హిమాలయాలల్లో పూచే మొక్కలు మన తెలుగు రాష్ట్రాల్లో పూయడంతో వీటిని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ ఇవి వికసించాయి. మన్యం జిల్లా పార్వతీ పురంతో పాటూ తిరుమలలో కూడా పూచాయి. దీంతో వారి ఇంట ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.

T.V.SRIKAR