విరాట పర్వం మళ్ళీ షురూ, ఫామ్ లోకి వచ్చేసిన రన్ మెషీన్

ఆహా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు... అభిమానుల నిరీక్షణ ఫలించింది... రన్ మెషీన్ పరుగుల దాహం తీరింది... సుధీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారింది....అది కూడా కంగారూ గడ్డపై తన ఫామ్ కొనసాగిస్తూ సెంచరీతో దుమ్మురేపేశాడు విరాట్ కోహ్లీ...

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 11:57 AM IST

ఆహా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు… అభిమానుల నిరీక్షణ ఫలించింది… రన్ మెషీన్ పరుగుల దాహం తీరింది… సుధీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారింది….అది కూడా కంగారూ గడ్డపై తన ఫామ్ కొనసాగిస్తూ సెంచరీతో దుమ్మురేపేశాడు విరాట్ కోహ్లీ… ఆసీస్ పిచ్ లు అంటే తనకెందుకు అంత ఇష్టమో చూపిస్తూ శతక్కొట్టాడు. పెర్త్ లాంటి పేస్ పిచ్ పై ఫామ్ లోకి వస్తే ఆ కిక్కే వేరంటూ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా బ్యాటింగ్ చేశాడు. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్‌ల్లో విరాట్ ఈ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కెరీర్‌లో కోహ్లీకి ఇది 30వ శతకం. ఓవరాల్‌గా 81వ సెంచరీ. ఆసీస్ గడ్డపై విరాట్ కు ఇది 9వ శతకం. మార్నస్ లబుషేన్ వేసిన 135వ ఓవర్ మూడో బంతిని స్వీప్ షాట్‌తో లెగ్ సైడ్ బౌండరీ తరలించిన కోహ్లీ.. 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే 96 పరుగుల దగ్గర బంతి బౌండరీ వెళ్లిందా.. లేదా.. అనే సందిగ్దంలో ఉన్న కోహ్లీ.. అంపైర్‌ సిగ్నల్ ఇవ్వడంతో హెల్మెట్ తీసి సంబరాలు చేసుకున్నాడు. అనుష్క శర్మ ఉన్న గ్యాలరీ వైపు తిరిగి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. కోహ్లీ సెంచరీ పూర్తి అయిన వెంటనే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 487 రన్స్ కు డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బాల్స్ ను బౌండరీలు కొట్టాడు. నిజానికి కోహ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవడం కొత్తేమీ కాదు. కానీ ఈ సారి చివరి ఆసీస్ టూర్ అంటూ చాలామంది అంచనా వేయడం, రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడన్న విమర్శలు…టెస్టుల్లో సెంచరీ చేసి చాలా రోజులైపోయిందన్న బాధ… ఇవన్నీ కోహ్లీని కూడా తీవ్రంగానే వెంటాడాయి. తాను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేకున్నా బోర్డర్ గవాస్కర్ లాంటి ప్రతిష్టాత్మక సిరీస్ లో అది కూడా కంగారూ గడ్డపై శతకం కొడితే ఎలాంటి కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా…

తన పని అయిపోయిందనుకున్న ప్రతీసారీ పడిలేచిన కెరటంలా దుమ్మురేపిన కోహ్లీ ఏడాది చివర్లో ఆసీస్ పై ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది. రాసిపెట్టుకోండి… మళ్ళీ విరాటపర్వం మొదలైంది… ఇక రన్ మెషీన్ ను ఎవ్వరూ ఆపలేరు అంటూ సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు.