IT Industry: ఐటీ కంపెనీల్లో భారీ కోతలు.. సగటున గంటకు 23 మంది ఉద్యోగులపై వేటు

భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా దిగ్గజ సంస్థలు కూడా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది.

  • Written By:
  • Updated On - October 15, 2023 / 04:03 PM IST

ఐటీ పరిశ్రమల్లో దాదాపు లక్షల ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్ డాట్ అనే తాజాగా తన సైట్లో ప్రచురించింది. ఈ సంస్థ 2022 నుంచి ఎంత మంది ఉద్యోగులను టెక్ సంస్థలు తొలగించాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. వారి డేటాను ట్రాక్ చేసి కచ్చితమైన నివేదికను అందించింది. గడిచిన రెండేళ్ల కాలంలో దిగ్గజ కంపెనీలు మొదలు కొత్తగా నెలకొల్పిన స్టార్టప్స్ వరకూ అన్ని టెక్ సంస్థలు దాదాపు 4లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలో వెల్లడైంది. ఇందులో మన దేశానికి చెందిన స్టార్టప్ లు 110 కంపెనీలు దాదాపు 30వేల మందిని ఇళ్లకు పంపించాయి. ప్రపంచంలోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్పెక్ట్రమ్ లోని అతి పెద్ద ఐటీ కంపెనీలు, అంకురాలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ ప్రక్రియ రెండేళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. కొత్త ఉద్యోగాలను అందించక పోగా ఉన్న ఉద్యోగాలను లే ఆఫ్ పేరుతో తొలగించడంతో టెక్ ఉద్యోగుల సరిస్థితి ఆందోళనలో పడింది. అలాగే కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

రోజుకు 555 మందిని తొలగింపు..

ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్పటి వరకూ 4,04,962 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసిందని ఈ నివేదికలో వెల్లడైంది. 2022 సంవత్సరంలో 1061 సాఫ్ట్ వేర్ కంపెనీల్లో దాదాపు 1,64,769 మందిపై వేటు వేసినట్లు ప్రకటించింది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 13 వరకూ పరిస్థితి గమనించినట్లయితే 1059 కంపెనీల్లో 2,40,193 మందిని తీసేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన రెండు సంవత్సరాలుగా రోజుకు 555 మంది ఉద్యోగాలను కోల్పోవల్సి వచ్చింది. ఈ లెక్కన ప్రతి గంటకు 23 మంది ఐటీ ఉద్యోగులు కంపెనీ నుంచి ఇంటి బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో 89,554 మంది ఉద్యోగాల నుంచి నిష్క్రమించినట్లు లెక్కలు చెబుతున్నాయి. నాటి మొదలు నేటి వరకూ ఐటీ కంపెనీల్లో లేఆఫ్ ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా గత నెల సెప్టెంబర్లో అయితే 4,632 మంది ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు. రిటైల్ టెక్ లో 29,161, కన్స్యూమర్ టెక్ లో 28,873 మంది ఉద్యోగులను తొలగించినట్లు తేలింది.

అమెరికన్ కంపెనీ ఉద్యోగుల్లో వేటు..

క్వాల్ కాం అనగానే గుర్తుకొచ్చేది మొబైల్, లాప్ టాప్ లలో ఉండే చిప్. ఈ దిగ్గజ చిప్ సంస్థ అమెరికాకు చెందింది. ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని తొలగించింది. అంటే ఈ లెక్క ప్రకారం 1258 మందికి ఉద్వాసన పలికినట్లు అర్థం చేసుకోవాలి. శాండియాగో, శాంటా క్లారా ప్లాంట్స్ లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తాజాగా పేర్కొంది. అయితే పాంట్ల మూసివేత మాత్రం ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, డిమాండ్ తగ్గడంతో పాటూ ఆర్థిక మందగమనం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాలిఫోర్నియా ఉద్యోగుల అభివృద్ది శాఖకు దాఖలు చేసిన సమాచారం ప్రకారం శాన్ డియాగో 1,064, శాంటా క్లారా 194 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. పైగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎలాంటి నష్టపరిహారాన్ని, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించక పోవడం గమనార్హం. భవిష్యత్తులో వీరికి ఏమైన బెనిఫిట్లు అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

మన దేశంలోనూ అదే పరిస్థితి..

భారతదేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీ ఎల్ టెక్, విప్రో వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. 2023 రెండవ త్రైమాసికానికిగానూ 16 వేల మంది ఉద్యోగులు కంపెనీ తొలగించినట్లు తెలిసింది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో మరొకరిని నియమించుకోకపోవడమే దీనిని కారణం అంటున్నారు టెక్ నిపుణులు. మనీ కంట్రోల్ అనే సంస్థ అందించిన నివేదికలో చాలా కీలక అంశాలను ప్రస్తావించింది. తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం టీసీఎస్ 6,333, ఇన్ఫోసిస్ 7,530, హెచ్ సి ఎల్ టెక్ 2,299 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. అలాగే డిమాండ్ కంటే ముందుగా ఉద్యోగులను భర్తీ చేసుకున్నాయి కొన్ని సంస్థలు. ఆశించినంత మేర ప్రాజెక్టులు రాకపోవడంతో తిరిగి వారిని తొలగించాల్సి వచ్చింది అంటున్నారు ఇన్ఫోసిస్ సంస్థ ఉన్నతాధికారులు.

T.V.SRIKAR