చరిత్రకు అడుగే దూరం, బుమ్రాను ఊరిస్తున్న రికార్డ్

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా ఫుల్ జోష్ లో రెండో టెస్టుకు ప్రిపేరవుతోంది. అయితే రెండో టెస్ట్ భారత్ కు సవాల్ గానే చెప్పాలి. అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్ డే అండ్ నైట్ , పింక్ బాల్ తో ఆడనుండడమే దీనికి కారణం. గత పర్యటనలో పింక్ బాల్ టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 03:04 PM IST

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా ఫుల్ జోష్ లో రెండో టెస్టుకు ప్రిపేరవుతోంది. అయితే రెండో టెస్ట్ భారత్ కు సవాల్ గానే చెప్పాలి. అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్ డే అండ్ నైట్ , పింక్ బాల్ తో ఆడనుండడమే దీనికి కారణం. గత పర్యటనలో పింక్ బాల్ టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది.ఈ సారి మాత్రం డే అండ్ నైట్ టెస్టులో గెలవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. కాగా ఈ కీలకమైన మ్యాచ్ కు ముందు భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను అరుదైన వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. బుమ్రా మరో వికెట్ తీస్తే ఈ ఏడాది టెస్ట్‌ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టిస్తాడు.ఈ ఏడాది ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 3.04 ఎకానమీతో 49 వికెట్లు తీసాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్‌లో బుమ్రా 8 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో బుమ్రానే భారత జట్టుకు సారథ్యం వహించాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేసిన బూమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడు. పేస్ పిచ్ పై తనదైన బౌలింగ్ తోనే కాదు మిగిలిన బౌలర్లను చక్కగా ఉపయోగించుకుని విజయాన్ని అందించాడు. కాగా తొలి టెస్టులో బూమ్రా పలు రికార్డులు అందుకున్నాడు. టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ యావరేజ్ కలిగిన రెండో బౌలర్ గా నిలిచాడు. 41 మ్యాచ్ లలో 20.17 యావరేజ్ తో 177 వికెట్లు తీసాడు. అలాగే ఆస్ట్రేలియా‌ను ఓడించిన రెండో ఏషియన్ కెప్టెన్‌గానూ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే కూడాసాధించాడు. ఇక టెస్టుల్లో అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ల జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో నిలిచాడు.

పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్.. ఆసీస్ దేశవాళీ టీమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండురోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి రావడంతో బూమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.